మాజీ భార్యకు భరణం చెల్లించడానికి దొంగతనాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-19 05:33:55  IST  )

సాధారణంగా, విడాకుల సమయంలో భర్తలు తమ భార్యలకు భరణం (Alimony) చెల్లించాల్సి వస్తుంది.

మాజీ భార్యకు భరణం చెల్లించడానికి దొంగతనాలు
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా, విడాకుల సమయంలో భర్తలు తమ భార్యలకు భరణం (Alimony) చెల్లించాల్సి వస్తుంది. భార్య భవిష్యత్తు జీవనోపాధి కోసం, ఆమెకు ఆర్థిక భద్రత కల్పించేందుకు న్యాయపరంగా ఇచ్చే మొత్తంగా భావిస్తారు. కోర్టు తీర్పు మేరకు భర్త తన ఆదాయ స్థితిని బట్టి నెలవారీగా లేదా ఒకే విడతగా ఈ భరణం చెల్లించాలి. అయితే, కొన్నిసార్లు ఈ భరణం చెల్లించడం కొంతమంది భర్తలకు భారంగా మారుతుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు ఈ బాధ్యతను నిర్వర్తించలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఓ వ్యక్తి చైన్ స్నాచర్‌గా మారి దొంగతనాల బాట పట్టాడు. తాజాగా మహారాష్ట్ర రాష్ట్రలోని నాగ్‌పుర్‌లో (Nagpur) ఈ ఘటన వెలుగుచూసింది.

నాగ్‌పుర్‌కు చెందిన 43 ఏళ్ల కన్హయ్య నారాయణ్‌ బౌరాషి అనే వ్యక్తి మాజీ భార్యకు నెలకు రూ.6,000 భరణం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే, ఉద్యోగం లేకపోవడంతో ఆ మొత్తం భరణం ఎలా చెల్లించాలో తెలియక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చోరీలకు పాల్పడి భరణం చెల్లించాలని అనుకున్నాడు. ఇటీవల ఓ 74 ఏళ్ల మహిళ గొలుసు చోరీకి గురైంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలో చైన్‌ లాక్కొని వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, కన్హయ్యను అరెస్టు చేశారు.

కన్హయ్యను విచారించగా చోరీ చేసింది తానేనని, అసలు విషయాన్ని చెప్పాడు. మొదటి భార్య తన నుంచి విడాకులు తీసుకుందని, ఆమెకు కోర్టు ఆదేశం మేరకు భరణం చెల్లించాల్సింది ఉందని చెప్పాడు. ఉద్యోగం లేకపోవటంతో ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు చైన్లు దొంగిలించినట్లు చెప్పాడు. చోరీ చేసి తీసుకొచ్చిన బంగారాన్ని స్థానికంగా ఉన్న నగల వ్యాపారికి విక్రయించినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ వ్యాపారిని కూడా అరెస్టు చేశారు.

Next Story