లోకం స్తంభించింది.. మానవత్వం నిలబడింది! నేటితో దేశంలో లాక్‌డౌన్‌కు ఆరేళ్లు

by Kema Shiva Kumar |

దేశంలో లాక్‌డౌన్ విధించి నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. 2020లో ప్రధాని మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ భారతదేశ చరిత్రలోనే ఓ కీలక మలుపుగా నిలిచింది.

లోకం స్తంభించింది.. మానవత్వం నిలబడింది! నేటితో దేశంలో లాక్‌డౌన్‌కు ఆరేళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరేళ్లు అప్పుడే కళ్లముందు కాలగర్భంలో కలిసిపోయాయి. 2020లో సరిగ్గా ఇదే రోజు సగటు భారతీయులు ఎవరూ మర్చిపోలేని రోజు. రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ ఒకే ఒక్క ప్రకటనతో 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఒక్కసారిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.

21 ఏళ్లు వెనక్కి వెళ్తామన్న వార్నింగ్..

లాక్‌డౌన్ వేళ 21 రోజులు క్రమశిక్షణతో ఉండకపోతే.. దేశం 21 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ప్రధాని చెప్పిన మాటలు, హెచ్చరికలు ప్రజల్లో భయాందోళనలు కలిగించినా, అది మానవాళికి పెను సవాలుగా మారాయి. ఆ మరునాడు ఉదయం నుండి రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. పల్లెటూరు నుంచి పట్నం వరకు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కర్ఫ్యూ వాతావరణమా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు జనంతో కిటకిటలాడిన బస్ స్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వెలవెలబోయాయి. లాక్‌డౌన్ వల్ల మనుషులు ఇళ్లకే పరిమితమైనా, ప్రకృతి మాత్రం స్వేచ్ఛగా శ్వాస పీల్చుకుంది.

కాలుష్య రహిత ఆకాశం..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. కొన్ని దశాబ్దాల తర్వాత పంజాబ్‌ (Punjab)లోని జలంధర్ (Jaladhar) నుంచి హిమాలయ పర్వతాలు స్పష్టంగా కనిపించడం అప్పట్లో ప్రపంచవ్యాప్త వార్త అయ్యింది. రోడ్లపై అడవి జంతువులు, పక్షులు నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. గంగా, యమునా నదులు స్వచ్ఛంగా మారిపోయాయి.

మళ్లీ చిగురించిన మానవ సంబంధాలు..

లాక్‌డౌన్ కష్టనష్టాలను అటుంచితే.. రోటీన్ లైఫ్‌తో విసిగిపోతున్న మనిషికి ఇది ఒక గొప్ప ప్రశాంతతను అందించింది. నిత్యం మొబైల్ ఫోన్లు, ఆఫీస్ టెన్షన్లలో సతమతమయ్యే తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఆడిపాడారు. 90వ దశకంలోని రామాయణం (Rayamayan), మహాభారతం (Maha Bharath) సీరియల్స్ మళ్లీ టీవీల్లో ప్రసారం కావడంతో కుటుంబమంతా కలిసి కూర్చుని చూడటం ఒక పండుగలా మారింది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడటంతో ప్రతి ఇంట్లో పంక్తి భోజనాలు దర్శనమిచ్చాయి. ఆ 21 రోజుల లాక్‌డౌన్ మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా, ఎదుటివారికి తోడుగా నిలబడటం నేర్పాయి.

కరోనా యోధులకు కరతాళధ్వనులతో సెల్యూట్..

కరోనా కష్టకాలంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలను దేశం గుర్తించింది. ప్రధానమంత్రి మోదీ సూచన మేరకు వారి సేవలను గుర్తిస్తూ.. దేశమంతటా చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం లాంటివి దేశ ఐక్యతను ప్రపంచానికి చాటాయి. ఆకలితో ఉన్న పేదలకు, వలస కూలీలకు ఎంతో మంది స్వచ్ఛందంగా భోజనాలు పెట్టడం ద్వారా ‘మనిషికి మనిషే సాయం’ అన్న నానుడి అక్షరాలా నిజమైంది. దేశవ్యాప్త లాక్‌డౌన్ కేవలం ఓ గడ్డు కాలం మాత్రమే కాదు.. వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ విలువలు, సేవాతత్వం నేర్పిన అద్భుత పాఠమే.

Next Story