మండుటెండల్లో మూగజీవాల దాహార్తి.. నీటి కోసం బస్సును ఆపిన కోతి!

by Ramesh Naini |

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి.

మండుటెండల్లో మూగజీవాల దాహార్తి.. నీటి కోసం బస్సును ఆపిన కోతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ఎండ తీవ్రతకు తాళలేక, దాహం తీర్చుకునేందుకు ఏకంగా ఓ కోతి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఘటన యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఖండాలా ఘాట్ సమీపంలోకి రాగానే.. ఓ కోతి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి బస్సుకు అడ్డుగా నిలబడింది. డ్రైవర్, ప్రయాణికులు ఎంత అదిలించినా అది పక్కకు తప్పుకోలేదు. ఆ మూగజీవి దాహంతో అలమటిస్తోందని గ్రహించిన కొందరు ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో దానికి నీరు అందించారు. బాటిల్ లోంచి నీళ్లు తాగుతున్న కోతిని చూసిన వెంటనే, సమీప అడవిలో నుంచి మరికొన్ని కోతులు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు చుట్టూ చేరాయి. ఆకలి దప్పులతో ఉన్న ఆ మూగజీవాలను చూసి చలించిపోయిన ప్రయాణికులు, తమ వద్ద ఉన్న నీటిని వాటికి అందించి దాహం తీర్చారు.

వైరల్ అవుతున్న వీడియో..

బస్సులోని లతా శ్రీవాస్ అనే ప్రయాణికురాలు ఈ హృదయవిదారక దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహారాష్ట్రలో ఎండలు మండిపోతున్నాయి, మూగజీవాలు ఇలా ఇబ్బంది పడటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది’ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో, వేసవిలో అటవీ జంతువుల కోసం కనీస నీటి సదుపాయాలు (కృత్రిమ నీటి కుంటలు) ఏర్పాటు చేయని అటవీశాఖ అధికారుల తీరుపై నెటిజన్లు, స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అడవిలో నీరు దొరక్కపోవడం వల్లే జంతువులు ఇలా రోడ్ల పైకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story