Supreme Court: ఇ 20 పెట్రోల్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. భారత ఆటోమొబైల్ రంగంలో కీలక పరిణామంగా మారబోతున్నదా?

by Prasad Jukanti |   (  Updated:2025-09-01 15:59:55  IST  )

ఇథనాలు కలిసిన పెట్రోల్ వినియోగంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

Supreme Court:  ఇ 20 పెట్రోల్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. భారత ఆటోమొబైల్ రంగంలో కీలక పరిణామంగా మారబోతున్నదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇథనాల్ కలిపిన పెట్రోల్ విషయంలో దేశవ్యాప్తంగా వాహనదారులు, ఆటోమొబైల్ రంగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఇ20 ఇంధనంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఇ20 పెట్రోల్ వాడకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. ఇథనాల్ పెట్రోల్ ను సవాల్ చేస్తూ అడ్వకేట్ అక్షయ్ మల్హోత్రా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ షాదన్ ఫరాసత్ వాదనలు వినిపిస్తూ తాము ఇ20 పెట్రోల్ కు వ్యతిరేకం కాదని కేవలం కానీ పెట్రోల్ బంకుల్లో సరఫరా చేసే వారు ఇది ఇ20 ఇంధనం అని స్పష్టంగా తెలియజేయాలని కోరుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాలన్నీ ఈ ఇంధనాన్ని తట్టుకోలోలేవని ఏప్రిల్ 2023 తర్వాత తయారైన వాహనాలకు ఇది అనుకూలంగా ఉందన్నారు. ఇ20 ఇంధనం అవసరం కానీ వాహనాలను కూడా అందుకు తగినట్లుగా ఇంజిన్ కాలిబ్రేషన్ తో తయారు చేయాలి కదా అని వాదించారు.

భారత్‌లో ఏరకమైన పెట్రోల్ విక్రయించాలనేది బయటున్న వారు నిర్ణయిస్తారా?:

పిటిషనర్ వాదనలను అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తోసిపుచ్చారు. స్వీయ ప్రయోజనాలున్న లాబీ తరఫున పిటిషనర్ రంగంలోకి దిగారని అన్నారు. భారత్ లో ఏ పెట్రోల్ వాడాలనేది దేశం వెలుపల ఉన్న వారు నిర్దేశిస్తారా అని ప్రశ్నించారు. ఇ౨౦ (E20 Petrol) పెట్రోల్ వినియోగంతో చెరుకు రైతులకు లాభం చేకూరుతుందని విదేశీ మారక ద్రవ్యం పొదుపు అవుతుందని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం అటార్నీ జనరల్ వాదనతో ఏకీభవిస్తూ ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నిర్ణయంతో ఇథనాల్ వినియోగించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి కీలక ముందడుగు పడినట్లైంది.

పరిశ్రమలో భిన్నవాదనలు:

ఇ20 ఇథనాలు కలిపిన పెట్రోల్ వినియోగం విషయంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది సురక్షితం కాదని ఈ రకమైన ఇంధనం వినియోగంతో పాత వాహనాల ఇంజన్ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు మైలేజీ సమస్య ఉత్పన్నం అవుతుందని వాహనదారులు, పరిశ్రమలోని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇ 20 ఇంధనం కారణంగా వాహనాల ఇంజిన్ దెబ్బ తింటే వాటికి ఇన్సూరెన్స్ సైతం క్లయిమ్ కాదని చెబుతున్నారు. అయితే ఈ రకమైన పెట్రోల్ తో డెన్సిటీ కాస్త తక్కువ ఉన్నా దాని వల్ల మైలేజీ తగ్గుదల స్వల్పమేనని ప్రభుత్వం చెబుతోంది. ఇ20 ఇంధనం విషయంలో తలెత్తుతున్న అనుమానాలు అన్ని నిరాధారమైనవని ఇటీవలే సహజవాయువు మంత్రిత్వ శాఖ వివరణాత్మక విశ్లేషణ స్పష్టత కూడా ఇచ్చింది.

Next Story