- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులను దారుణంగా చితకబాదిన పూజారులు.. ఏమైందంటే?
ప్రసిద్ధ జ్యోతిబా ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. సుమారు 15 నుంచి 20 మంది పూజారులు కొందరు భక్తులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ప్రసిద్ధ జ్యోతిబా ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. సుమారు 15 నుంచి 20 మంది పూజారులు కొందరు భక్తులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితులను పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడమే కాకుండా కొబ్బరికాయలతోనూ పూజారులు దాడి చేయడం ఈ వీడియోలో కనిపించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ప్రధాన హారతి సమయంలో కొందరు యువకులు ఆలయంలో గందరగోళం సృష్టించారు. పూజారులపై గులాల్ (రంగు) చల్లి, వారి టోపీలను కింద పడేశారు. వారిని వారించే క్రమంలో సహనం కోల్పోయిన పూజారులు.. ఆ యువకులను గుడి బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదారు. కొందరు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినా వదిలిపెట్టలేదు.
సమర్థించిన ఆలయ కమిటీ..
ఈ ఘటనపై ఆలయ కమిటీ స్పందిస్తూ పూజారులకు మద్దతుగా నిలిచింది. పక్క ఊరి నుంచి మద్యం మత్తులో వచ్చిన సుమారు 100-200 మంది ఆకతాయిలు.. హారతిని అడ్డుకోవడమే కాకుండా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, వృద్ధ పూజారులను సైతం అవమానించారని ఆరోపించింది. పూజారులను అప్రతిష్టపాలు చేసేందుకే వీడియోను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






