VIRAL: సక్కగా మాట్లాడు.. మంత్రి మాటలకు రిపోర్టర్ కౌంటర్ (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2026-01-01 07:16:53  IST  )

రిపోర్టర్‍పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి చివరకు క్షమాపణలు చెప్పారు.

VIRAL: సక్కగా మాట్లాడు.. మంత్రి మాటలకు రిపోర్టర్ కౌంటర్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సహనం కోల్పోయిన రాష్ట్ర మంత్రి మీడియాపై చిందులు వేశారు. యూజ్ లెస్ ప్రశ్నలు చేయవద్దంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే మంత్రి మాటలకు అంతే ఘాటుగా రియాక్ట్ అయిన రిపోర్టర్ సరిగా మాట్లాడాలంటూ కౌంటర్ ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. దీంతో రిపోర్టర్ వర్సెస్ మంత్రి మధ్య (Minister vs Reporter) వాగ్వాదానికి సంబంధించిన ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మంత్రి దిగివచ్చి క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్ లో (Madhya Pradesh) జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?..

8 మంది మృతి 160 మంది ఆసుపత్రి పాలు:

దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్‍లోని ఇండోర్‍లో తాగే నీళ్లలో డ్రైనేజీ వాటర్ కలవడంతో (Indore Water Contamination) 8 మంది మృతి చెందగా మరో 160 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కైలాశ్ విజయవర్గీయను (Kailash Vijayvargiya) ఎన్డీటీవీకి చెందిన రిపోర్టర్ ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత కేవలం కింది స్థాయి అధికారులకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? సీనియర్ అధికారులు, పై స్థాయి నేతలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే అయిన మీతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి తుల్సీ సిలావత్‌కూ బాధ్యత లేదా? అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఖర్చులకు ఇంకా రీయింబర్స్‌మెంట్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సహనం కోల్పోయిన సదరు మంత్రి రిపోర్టర్‍పై చిందులు వేశారు. ఇలాంటి వృథా ప్రశ్నలు నన్ను అడుగొద్దంటూ దురుసుగా మాట్లాడారు. మంత్రి మాటలకు అక్కడున్న వారంతా షాక్ తినగా రిపోర్టర్ మాత్రం మంచిగా మాట్లాడాలని మంత్రికి సూచించారు. సీనియర్ మంత్రివై ఉండి యూజ్ లెస్ ప్రశ్నలు అంటారా? మాట్లాడే పద్ధతి లేదా అంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అనుచరులు కలగజేసుకుని రిపోర్టర్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా తాను మంత్రిని ప్రశ్నిస్తుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారని రిపోర్టర్ నిలదీశారు. అందుకు అతడు మా లీడర్ అంటూ మంత్రి అనుచరులు రిపోర్టర్ పై ఎదురు దిరిగారు. దీంతో మీ లీడర్ అయితే ఏంటి ప్రజలు చనిపోతే అడగొద్దా? నేనేమైనా మంత్రి పరువు తీశానా? మీ పని మీరు చేసుకోండి అంటూ మంత్రి అనుచరులకు సైతం కౌంటర్ ఇచ్చారు.

దెబ్బకు దిగివచ్చిన మంత్రి:

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన మంత్రి ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. నేను, నా బృందం గత రెండు రోజులుగా నిద్రలేకుండా ప్రభావిత ప్రాంతంలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. కలుషిత నీటివల్ల నా ప్రజలు బాధపడుతున్నారు. కొందరు చనిపోయారు. ఈ విషాద పరిస్థితుల్లో మీడియా ప్రశ్నకు స్పందిస్తూ నా మాటల్లో తప్పులు దొర్లాయి ఇందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. నా నియోజకవర్గం ప్రజలు పూర్తిగా సురక్షితంగా, ఆరోగ్యంగా మారే వరకు నేను నిశ్చలంగా ఉండలేనని చెప్పుకొచ్చారు. మొత్తంగా మంత్రి వర్సెస్ రిపోర్టర్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
వీడియో
Next Story