Crime: పెరోల్ పై వచ్చిన ఖైదీని ఐసీయూలోనే మర్డర్

by Prasad Jukanti |

బిహార్ లో దారుణం జరిగింది.

Crime: పెరోల్ పై వచ్చిన ఖైదీని ఐసీయూలోనే మర్డర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు అనుమానాస్పద రీతిలో చనిపోగా రాజకీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఓ ఖైదీని ఆసుపత్రి ఐసీయూలోనే మర్డర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని పాట్నాలో చోటు చేసుకోవడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే ఈ ఘటన పూర్తిగా వ్యక్తిగతమైన కక్షలతో జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బక్సర్ జిల్లాకు చెందిన చందన్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో అతడు ప్రస్తుతం బ్యూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. వైద్య చికిత్స కోసం పెరోల్ పై (parole) బయటకు వచ్చిన ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అతడికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. అయితే ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో ఐదుగురు గుర్తుతెలియని దుండగులు నేరుగా ఆసుపత్రి ఐసీయూ వద్దకు చేరుకున్నారు. ఐసీయూ తలుపు వద్దకు రాగానే తమ వద్ద దాచుకునితెచ్చిన తుపాకులను బయటకు తీసి నేరుగా ఐసీయూలోకి దూరి చందన్ ను పై కిరాతకంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందన్ మృతి చెందగా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దుండగులు ఆసుపత్రిలోకి వచ్చి వెళ్లిన విజువల్స్ ఆసుపత్రి సీసీ కెమెరా పుటేజీల్లో రికార్డు అయింది. ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పాట్నా (సెంట్రల్) ఎస్పీ దీక్ష తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కాగా బిహార్ లో జరుగుతున్న వరుస నేరాల పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల స్పందిస్తూ బిహార్ క్రైమ్ క్యాపిటల్ గా మారిందని ఆరోపించారు.

Next Story