భారత్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ జెండా.. అజెండా ఇదే! నిరుద్యోగ యువత పొలిటికల్ సెటైర్ వైరల్!

by Ramesh Naini |

భారతదేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ప్రస్తుతం బొద్దింకల పార్టీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party-CJP) అనే పేరు ఓ సంచలనంగా మారింది.

భారత్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ జెండా.. అజెండా ఇదే! నిరుద్యోగ యువత పొలిటికల్ సెటైర్ వైరల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ప్రస్తుతం బొద్దింకల పార్టీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party-CJP) అనే పేరు ఓ సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన ఈ వినూత్న ‘సెటైరికల్’ పార్టీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే వేలాది మంది ఈ పార్టీలో సభ్యులుగా చేరడం గమనార్హం.

అసలు కథేంటి? ‘కాక్రోచ్’ పేరు ఎందుకు వచ్చింది?

ఇటీవల ఒక కోర్టు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. నకిలీ డిగ్రీలతో జర్నలిజం, లా, ఆర్టీఐ వంటి రంగాల్లోకి ప్రవేశిస్తూ వ్యవస్థను నాశనం చేస్తున్న వారిని ‘బొద్దింకలు’ (Cockroaches), ‘పరాన్నజీవులు’ (Parasites) అని సంబోధించారు. అయితే, ఈ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసినవేనంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత సీజేఐ స్పందిస్తూ.. తాను నిరుద్యోగులను అనలేదని, కేవలం నకిలీ సర్టిఫికెట్లతో చట్టవిరుద్ధంగా చొరబడే వారిని మాత్రమే అన్నానని స్పష్టత ఇచ్చారు. కానీ, ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంటర్నెట్‌లో యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అభిజీత్ దిప్కే (30) మే 16న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ప్రకటిస్తూ.. ఒక గూగుల్ ఫామ్‌ను https://cockroachjantaparty.org/షేర్ చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే దీనికి 5,000 కి పైగా రిజిస్ట్రేషన్లు రాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 80,000 దాటినట్లు తెలుస్తోంది.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ అజెండా.. మోటో ఇదే!

ఈ పార్టీ మోటో వింటే ఎవరికైనా నవ్వు రాక మానదు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (బద్ధకస్తులు)’ అనే అజెండాతో ఈ పార్టీ నడుస్తోంది. ఈ పార్టీలో చేరాలంటే నిరుద్యోగి అయి ఉండాలి, విపరీతమైన బద్ధకం ఉండాలి, 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఉంటూ ప్రొఫెషనల్‌గా విమర్శలు (Rant) చేయగలగాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ‘మొబైల్ ఫోన్’ను తమ పార్టీ గుర్తుగా ప్రకటించారు. ‘ప్రతి ఫోన్ ఇప్పుడు ఒక ధైర్యమైన గొంతు.. విప్లవం మీ స్క్రీన్ల నుంచే మొదలవుతుంది’ అని వీరు పేర్కొంటున్నారు. త్వరలోనే యువత కోసం ఆన్‌లైన్ ద్వారా ఒక వర్చువల్ జెన్-జీ (Gen-Z) ను నిర్వహించేందుకు ఈ పార్టీ సిద్ధమవుతోంది.

రంగంలోకి దిగిన ప్రతిపక్ష నేతలు!

ఈ హాస్యాస్పద రాజకీయం కేవలం మీమ్స్‌కే పరిమితం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్‌లతో పాటు సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ వంటి ప్రముఖులు ఈ పార్టీ ట్వీట్లకు స్పందించారు. ‘తాను కూడా ఈ కాక్రోచ్ పార్టీలో చేరాలనుకుంటున్నాను’ అని మహువా మోయిత్రా ట్వీట్ చేయగా.. ‘1983 వరల్డ్ కప్ గెలవడమే మీకున్న పెద్ద అర్హత, వెల్కమ్ టు CJP’ అంటూ సదరు పార్టీ హ్యాండిల్ ఆమెను ఆహ్వానించింది.

కామెడీ వెనుక అసలు రాజకీయం?

పైకి ఇదంతా కేవలం ఒక సరదా మీమ్ పేజీలా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కే సాధారణ నెటిజన్ కాదు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున సోషల్ మీడియా ప్రచారాన్ని నడిపించిన కీలక వ్యక్తి. గతంలో రైతుల నిరసనలు, ఈవీఎంలపై అనుమానాలు, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాల్లో ఇతను చురుగ్గా ఉన్నాడు. దీనితో పాటు ఈ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే విపక్షాల అజెండా స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

ఐదు పాయింట్లతో మేనిఫెస్టో

ఈ పార్టీ ఐదు పాయింట్లతో మేనిఫెస్టో కూడా రూపొందించారు. రిటైర్ అయిన ఏ సీజేఐకి కూడా రాజ్యసభ సీటు ఇవ్వకూడదు. ఓట్లు అక్రమంగా డిలీట్ చేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయాలి (ఇది ప్రతిపక్షాల పాత ఆరోపణ). అంబానీ, అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. నీట్ (NEET), సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆగ్రహాన్ని ఈ పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.. అని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాగా, సీజేఐ వ్యాఖ్యల మీదున్న కోపాన్ని ఆసరాగా చేసుకుని, యువత అసంతృప్తిని,హాస్యాన్ని జోడించి పుట్టుకొచ్చిందే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’. ఇది కేవలం నిరుద్యోగ యువత చేసిన ఆకతాయి సృష్టా? లేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నడుపుతున్న ఒక పక్కా ప్లాన్డ్ సోషల్ మీడియా ప్రయోగమా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story