అక్కడ ఎలా పెట్టావ్‌రా? ఎక్స్‌ప్రెస్‌వేపై గాల్లో వేలాడుతున్న థార్.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

by Ramesh Naini |

ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక మహీంద్రా థార్ (Mahindra Thar) కారు ఏకంగా రోడ్డు పైభాగంలో ఉండే కిలోమీటర్ సైన్ బోర్డుకు వేలాడుతూ కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

అక్కడ ఎలా పెట్టావ్‌రా? ఎక్స్‌ప్రెస్‌వేపై గాల్లో వేలాడుతున్న థార్.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వింత వీడియో వెలుగులోకి వస్తోంది. తాజాగా ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక మహీంద్రా థార్ (Mahindra Thar) కారు ఏకంగా రోడ్డు పైభాగంలో ఉండే కిలోమీటర్ సైన్ బోర్డుకు వేలాడుతూ కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘అసలు అక్కడ ఎలా పెట్టావ్‌రా..?’ అంటూ ఈ వీడియోపై మీమ్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

వైరల్ వీడియోలో ఏముంది?

సుమారు 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో, ఎక్స్‌ప్రెస్‌వేపై దిశలను సూచించే గ్రీన్ కలర్ ఓవర్ హెడ్ సైన్ బోర్డుకు ఒక థార్ కారు ఇరుక్కుపోయి వేలాడుతూ కనిపిస్తుంది. ఇది చూసిన ప్రయాణికులు షాక్ అవుతున్నట్లు, కింద ట్రాఫిక్ నిలిచిపోయినట్లు వీడియోలో చిత్రీకరించారు. దీనికి ‘Not all Thars, but always a Thar’ అనే క్యాప్షన్ జతచేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్సిడెంట్ అంటే ఇదేనేమో! అంటూ ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది.

అసలు నిజం.. ఇది 'రియల్' కాదు

వీడియో చూడటానికి ఎంత నిజంగా అనిపించినప్పటికీ, ఇది పూర్తిగా AI (Artificial Intelligence) లేదా CGI సాయంతో ఎడిట్ చేసిన వీడియో అని తేలింది. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదం అని చెబుతున్నప్పటికీ, ఆ కారుకు కేరళ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండటం అనుమానాలకు తావిచ్చింది. దాదాపు 1.5 టన్నుల బరువు ఉండే థార్ కారు, అంతటి సన్నని సైన్ బోర్డుకు తగిలితే ఆ బోర్డు నిలబడటం అసాధ్యం. కానీ వీడియోలో బోర్డు చెక్కుచెదరకుండా ఉంది. ఇంతటి భారీ ప్రమాదం జరిగితే దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేది. కానీ ఢిల్లీ లేదా గురుగ్రామ్ పోలీసుల వద్ద ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నిజమని నమ్మకండి.. ముఖ్యంగా AI కాలంలో కళ్లకు కనిపించేది కూడా అబద్ధం కావొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Next Story