ఇరాన్-యూఏఈ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ అమల్లోకి!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-08 03:48:16  IST  )

ఇరాన్ దాడుల హెచ్చరికలతో యూఏఈ ప్రభుత్వం ఆ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది.

ఇరాన్-యూఏఈ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ అమల్లోకి!
X

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. ఇరాన్ (Iran) నుంచి మిస్సైల్స్, డ్రోన్ దాడులు జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన యూఏఈ (UAE) ప్రభుత్వం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ (Air Defense System)‌ను యాక్టివేట్ చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాలతో పాటు చమురు నిల్వ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దుల వెంబడి సైన్యం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను దృష్ట్యా యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని బంకర్లు, భూగర్భ ఆశ్రయ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక రేడియో, టీవీ ఛానెల్స్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది.

కాగా, కొద్ది రోజులుగా ఇరాన్, యూఏఈ మధ్య దౌత్యపరమైన విభేదాలు ముదురుతున్నాయి. ప్రాంతీయ ఆధిపత్య పోరు, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వివాదాల నేపథ్యంలో ఇరాన్ దాడులకు దిగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఏఈ తీసుకున్న ఈ ముందస్తు చర్యలు గల్ఫ్ దేశాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Next Story