పాకిస్తాన్‌లో అదుపుతప్పిన పరిస్థితి.. కాల్పుల్లో 12 మంది మృతి

by Gantepaka Srikanth |

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్తలతో పాకిస్తాన్ అట్టుడుకుతోంది.

పాకిస్తాన్‌లో అదుపుతప్పిన పరిస్థితి.. కాల్పుల్లో 12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్తలతో పాకిస్తాన్(Pakistan) అట్టుడుకుతోంది. ఆదివారం కరాచీలోని అమెరికా కాన్సులేట్ వెలుపల జరిగిన నిరసనలు తీవ్ర హింసా రూపం దాల్చాయి. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో అమెరికా మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో కనీసం 12 మంది(12 killed) మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

కాల్పులకు దారితీసిన ఉద్రిక్తతలు..

ఇరాన్ నేత ఖమేనీ మరణానికి నిరసనగా షియా సంఘాలు కరాచీలోని దౌత్య ప్రాంతం(Diplomatic Zone) వైపు భారీ ర్యాలీ నిర్వహించాయి. నిరసనకారులు వాషింగ్టన్ మరియు టెల్ అవీవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను తోసుకుని అమెరికా కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో కాన్సులేట్ రక్షణలో ఉన్న అమెరికా మెరైన్లు కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఈ మరణాల సంఖ్యను పాక్ ప్రభుత్వం లేదా అమెరికా అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు..

కరాచీలోనే కాకుండా పాకిస్తాన్‌లోని ఇతర ప్రధాన నగరాల్లోనూ నిరసనలు మిన్నంటాయి. లాహోర్‌లో వందలాది మంది నిరసనకారులు అమెరికా కాన్సులేట్ వెలుపల బైఠాయించారు. రహదారిపైనే ప్రార్థనలు నిర్వహించి అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ ఇక్కడ ఎలాంటి హింస నమోదు కాలేదు. మరోవైపు ఉత్తర పాకిస్తాన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ఐక్యరాజ్యసమితి (UN) కార్యాలయ భవనానికి నిప్పు పెట్టారు. ప్రాణనష్టం జరగనప్పటికీ ఆస్తి నష్టం భారీగా సంభవించింది.

అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక..

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. కరాచీ, లాహోర్ మరియు పెషావర్ ప్రాంతాల్లో మరిన్ని నిరసనలు జరిగే అవకాశం ఉన్నందున, అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, జన సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే.. ఖమేనీ మరణం కేవలం పాకిస్తాన్‌నే కాకుండా మొత్తం ముస్లిం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో కూడా నిరసనకారులు అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి ప్రయత్నించగా భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి కరాచీలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Next Story