తేజస్ యుద్ధ విమానం కూలలేదు.. అది కేవలం సాంకేతిక లోపమే: హెచ్ఏఎల్ స్పష్టత

by Ramesh Naini |

స్వదేశీ తయారీ యుద్ధ విమానం 'ఎల్సీఏ తేజస్' కూలిపోయిందంటూ వస్తున్న వార్తలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తీవ్రంగా ఖండించింది.

తేజస్ యుద్ధ విమానం కూలలేదు.. అది కేవలం సాంకేతిక లోపమే: హెచ్ఏఎల్ స్పష్టత
X

దివ, డైనమిక్ బ్యూరో: స్వదేశీ తయారీ యుద్ధ విమానం 'ఎల్సీఏ తేజస్' (LCA Tejas) ఈ నెల 7వ తేదీన కూలిపోయిందంటూ వస్తున్న వార్తలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తీవ్రంగా ఖండించింది. అది ప్రమాదం కాదని, కేవలం రన్‌వేపై జరిగిన చిన్న సాంకేతిక లోపం (Minor technical incident) మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. సరిహద్దులకు సమీపంలోని ఒక ఎయిర్‌బేస్‌లో సాధారణ శిక్షణ ముగించుకుని ల్యాండ్ అవుతున్న సమయంలో తేజస్ విమానం అదుపు తప్పినట్లు సమాచారం. బ్రేకింగ్ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు (Hull loss) వస్తున్న వార్తలపై స్పందించని HAL.. తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా రికార్డు కలిగిన యుద్ధవిమానాల్లో ఒకటి అని పేర్కొంది. ప్రస్తుతం వైమానిక దళం (IAF)తో కలిసి ఆ సాంకేతిక సమస్యను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది.

ఆందోళనలో వైమానిక దళం..

గత కొంతకాలంగా తేజస్ విమానాలకు సంబంధించి వరుస ఘటనలు చోటుచేసుకోవడం వాయుసేనను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు మూడు ఘటనలు నమోదయ్యాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మార్చి 2024 లో జైసల్మేర్ వద్ద జరిగిన తొలి ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్‌షోలో జరిగిన ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలో జరిగిన తాజా ఘటనలో పైలట్ క్షేమంగా ఉన్నప్పటికీ, విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేజస్‌పై వైమానిక దళం అదనపు సాంకేతిక తనిఖీలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఏప్రిల్‌లో కీలక పరీక్షలు

తేజస్ ఆధునిక వెర్షన్ అయిన మార్క్ 1ఏ (Mk1A) విమానాల డెలివరీ ఇప్పటికే ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ నెలలో ఈ కొత్త వేరియంట్‌పై వాయుసేన కీలక అంచనా (Assessment) వేయనుంది. విమాన సామర్థ్యంలో ఎక్కడా రాజీ పడకుండా, చిన్నపాటి మార్పులతో వీటిని త్వరగా విధుల్లోకి తీసుకోవాలని భావిస్తోంది. ఏప్రిల్ పరీక్షల అనంతరం వీటి ఇండక్షన్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story