శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్‌ వివాదం.. స్పందించిన దేవస్వం బోర్డు

by Naga Rani Yarlagadda |

కేరళలోని శబరిమల ఆలయంలో ఇటీవల బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి శబరిమల ఆలయం వార్తల్లో నిలిచింది.

శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్‌ వివాదం.. స్పందించిన దేవస్వం బోర్డు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని శబరిమల ఆలయంలో ఇటీవల బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి శబరిమల ఆలయం వార్తల్లో నిలిచింది. ఈసారి ఆలయ సన్నిథానంలో సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) స్పందించింది. దీనిపై TDB విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టనుందని అధికారులు వెల్లడించారు. PTI పేర్కొన్న వివరాల ప్రకారం.. మకర విలక్కు పండుగ రోజున మలయాళ సినిమా దర్శకుడు అనురాజ్ మనోహర్, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిషేధిత ప్రాంతమైన సన్నిథానం పరిధిలో వీడియో చిత్రీకరణ చేశాడన్న ఫిర్యాదు మేరకు ఈ విచారణ ప్రారంభించనున్నారు.

ఈ విషయంపై TDB ప్రతినిధి పీటీఐకి తెలిపిన వివరాల ప్రకారం.. అనురాజ్ మనోహర్ వీడియో చిత్రీకరణకు అనుమతి కోరుతూ బోర్డును సంప్రదించాడని, అయితే ఆ అనుమతిని తిరస్కరించామని చెప్పారు. “శబరిమల యాత్రా సీజన్ ప్రారంభానికి ముందే అక్రెడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మాత్రమే అక్కడ చిత్రీకరణకు అనుమతి ఉంటుంది.” అని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాలు బోర్డు దృష్టికి వచ్చినప్పుడు తప్పనిసరిగా విజిలెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనపై TDB విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ఎస్పీ సునీల్ కుమార్ వి మాట్లాడుతూ.. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. “దర్శకుడు నిజంగా ఎక్కడ చిత్రీకరణ చేశాడో ఇప్పటికీ తెలియదు” అని అన్నారు. ఇదిలా ఉండగా.. అనురాజ్ మనోహర్ టీవీ ఛానళ్లకు ఇచ్చిన వివరణలో.. సన్నిథానం ప్రాంతంలో కాకుండా పంపానది వద్ద మాత్రమే వీడియో తీసినట్లు చెప్పారు. సన్నిథానంలో చిత్రీకరణకు అనుమతి కోరినా, బోర్డు తిరస్కరించిందని తెలిపారు. సన్నిథానం పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి వీడియో చిత్రీకరణ లేదా సినిమా షూటింగ్ చేయడం నిషేధమని TDB ఇప్పటికే స్పష్టం చేసింది.

Next Story