టీసీఎస్ మత మార్పిడి కేసు.. నిందితురాలికి ఎంఐఎం ఆశ్రయం.. శివసేన తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

టీసీఎస్ మత మార్పిడి కేసు.. నిందితురాలికి ఎంఐఎం ఆశ్రయం.. శివసేన తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS) మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసు (Nashik TCS case) వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత 25 రోజులుగా పరారీలో ఉన్న ఆమెను గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీ నగర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే శివసేన పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. పరారీలో ఉన్న నిందితురాలికి ఎంఐఎం (AIMIM) నేతలు మద్దతు పలకడంతో పాటు, ఆమె తలదాచుకోవడానికి వారాల పాటు ఆశ్రయం కల్పించారని శివసేన మంత్రి సంజయ్ శిర్సాట్ ఆరోపించారు.

‘కార్పొరేట్ జిహాద్’.. ఎంపీపై విచారణ జరగాలి

మంత్రి సంజయ్ శిర్సాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ మజీద్ పటేల్ నివాసంలో నిడా ఖాన్ ఐదు రోజుల పాటు ఉన్నట్లు నాసిక్ పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఎంఐఎం నేతల అండతోనే ఆమె ఇన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిందని మండిపడ్డారు. ‘ఇది కేవలం ఒక మత మార్పిడి కేసు మాత్రమే కాదు, దీని వెనుక చాలా పెద్ద కోణం దాగి ఉంది. ఇదొక ‘కార్పొరేట్ జిహాద్’. ఎంఐఎం నేతలు ఆమెకు పూర్తి అండదండలు అందించారు. ఎంఐఎం మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ కూడా ఇటీవల ఆమెను కలిసి తన మద్దతు ప్రకటించారు. ఈ వ్యవహారంలో నిడా ఖాన్ ఒక చిన్న పావు మాత్రమే. జలీల్ పాత్రపై కూడా సమగ్ర విచారణ జరగాలి’ అని శిర్సాట్ డిమాండ్ చేశారు.

నిడా ఖాన్ అరెస్ట్ ఇలా..

నాసిక్ టీసీఎస్ మాజీ ఉద్యోగి అయిన నిడా ఖాన్ ఏప్రిల్ 10 నుంచి పరారీలో ఉంది. నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో గురువారం రాత్రి ఆమె పట్టుబడింది. పోలీసు అధికారుల ప్రత్యేక బృందాలు సాంకేతిక నిఘా (Technical surveillance) ద్వారా ఆమె ఆచూకీ కనిపెట్టాయి. ఛత్రపతి శంభాజీనగర్‌లోని నరేగావ్ ప్రాంతం, కౌసర్ పార్క్ వద్ద ఉన్న ఓ రెండు అంతస్తుల బంగ్లాలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆమెతో పాటు తల్లి, అత్త, మరో ఇద్దరు బంధువులు కూడా అక్కడే ఉన్నారు.

మే 11 వరకు పోలీసు కస్టడీ

మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, మత మార్పిడికి పాల్పడటం, లైంగికంగా వేధించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నిదా ఖాన్ ఎదుర్కొంటోంది. శుక్రవారం ఆమెను నాసిక్ రోడ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు మే 11 వరకు పోలీసు కస్టడీ విధించింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story