- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో లెటర్ వార్.. ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ ఆరోపణలపై టీవీకే క్లారిటీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తమ ఎమ్మెల్యే కామరాజ్ లేఖ రాశారన్న వార్తలను ఏఎంఎంకే (AMMK) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కొట్టిపారేయడంతో వివాదం మొదలైంది. అయితే.. దినకరన్ వాదనలను టీవీకే తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఇందుకు సంబంధించిన కీలక వీడియోను విడుదల చేసి షాక్ ఇచ్చింది.
వీడియోతో టీవీకే కౌంటర్..
తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ చేసిన ఆరోపణలను టీవీకే తిప్పికొట్టింది. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వచ్ఛందంగా, ఎంతో సంతోషంగా విజయ్ పార్టీకి మద్దతు తెలుపుతూ లేఖ రాస్తున్న దృశ్యాలను టీవీకే విడుదల చేసింది. "తమ పార్టీ అధినేత దినకరన్ అనుమతితోనే విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు కామరాజ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు దినకరన్ అబద్ధాలు ప్రచారం చేస్తూ వాస్తవాలను దాచిపెడుతున్నారు" అని టీవీకే ఒక ప్రకటనలో విమర్శించింది. అంతకుముందు.. తన పార్టీ ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ఇది హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) కిందకు వస్తుందని దినకరన్ ఆరోపించారు. ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి, తమ ఎమ్మెల్యే ఎన్డీయే కూటమికి, ఏఐఏడీఎంకేకు విధేయుడిగా ఉన్నారని స్పష్టం చేశారు. తాము ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు దినకరన్ లేఖ సమర్పించారు.
మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ వ్యూహం..
తమిళనాడులోని 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి మరో 10 సీట్లు (మొత్తం 118) అవసరం. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2) పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. సంప్రదాయ ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు భిన్నంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న విజయ్, చిన్న పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. తాము ఎవరితోనూ బేరసారాలు చేయాల్సిన అవసరం లేదని, మద్దతు స్వచ్ఛందంగా వస్తోందని టీవీకే ఈ సందర్భంగా స్పష్టం చేసింది.






