Tamilanadu: తమిళనాడులో శానిటైజేషన్ వర్కర్ల కోసం సంక్షేమ పథకాలు

by S Gopi |

కేబినెట్ సమావేశం తర్వాత తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఈ ప్రకటన చేశారు.

Tamilanadu: తమిళనాడులో శానిటైజేషన్ వర్కర్ల కోసం సంక్షేమ పథకాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పారిశుధ్య కార్మికుల ఉద్యోగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుధ్య కార్మికుల కోసం గురువారం ఆరు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించింది. కేబినెట్ సమావేశం తర్వాత తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఈ ప్రకటన చేశారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 5 మరియు 6 జోన్లలో పారిశుధ్య పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 13 రోజుల పాటు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం రిపన్ భవనం ముందు నిరసన తెలుపుతున్నారు. వారిని మద్రాస్ హైకోర్టు సూచనల మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కేబినెట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి సంక్షేమ పథకాలను ప్రారంభించాం. శాశ్వత ఉపాధి డిమాండ్ కోర్టు, కార్మిక ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది, కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకుని సమ్మెను ముగించి కార్మికులు తిరిగి పనిలోకి రావాలని కోరారు. కొందరు కార్మికుల అరెస్టులపై స్పందిస్తూ, 12 రౌండ్లలో చర్చలు జరిగాయి. నిరసన జరిగిన వెంటనే ఎవరినీ బలవంతంగా అరెస్టు చేయలేదు. కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే వారిని అదుపులోకి తీసుకున్నారని అన్నారు.

కార్మికుల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలు

* పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యం. ఇది చెన్నైతో ప్రారంభించి క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. తెల్లవారుజామున షిఫ్టుల కారణంగా చాలామంది కార్మికులు వంట చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

* పారిశుద్ధ్య కార్మికులు వారి సామాజిక-ఆర్థిక స్థితిని పెంచడానికి 6 శాతం వడ్డీ సబ్సిడీతో రూ. 3.5 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. దీనికోసం ఏటా రూ. 10 కోట్లు కేటాయించనున్నారు.

* కార్మికుల పిల్లలు ఉన్నత విద్య ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తక ఖర్చులకు రాయితీలు పొందవచ్చు. వారు ఏ పాఠశాలలో చదువుతున్నారనే దాంతో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది.

* తమిళనాడు హౌసింగ్ బోర్డు, తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డు పథకాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం 30,000 కొత్త ఇళ్ళు నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 'కలైజ్ఞార్ కనవు ఇల్లం' పథకం కింద ప్రాధాన్యత.

* పారిశుధ్య కార్మికుడు మరణిస్తే, వారి కుటుంబానికి సంక్షేమ బోర్డు ద్వారా రూ. 5 లక్షల పరిహారం లభిస్తుంది. మొత్తం రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. చెత్త సేకరణ వల్ల పారిశుద్ధ్య కార్మికులు బాధపడే ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక పథకం అమలు చేయనున్నారు.

* తమిళనాడు పారిశుధ్య కార్మికుల సంక్షేమ బోర్డులో 3 లక్షలకు పైగా మందిని నమోదు చేయాలనే లక్ష్యంతో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య బీమా కార్డుల జారీ.

* పారిశుధ్య కార్మికుల పనికి సంబంధించి పరిస్థితులు, భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అధునాతన మురుగునీటి శుభ్రపరిచే వాహనాలను అందించనుంది.

Next Story