రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుకగా రూ. 3,000 నగదు

by Malleboina Mahesh |

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు.

రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుకగా రూ. 3,000 నగదు
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సంక్రాంతి (పొంగల్) పండుగ సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 2.22 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ. 3,000 నగదు సహాయాన్ని ప్రకటించారు. గత ఏడాది కేవలం సరుకులు మాత్రమే అందించగా, ఈసారి ఏకంగా మూడు వేల రూపాయల నగదును నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడినప్పటికీ, పేద కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సరుకుల పంపిణీ, గిఫ్ట్ హ్యాంపర్

తాజా నిర్ణయంలో నగదుతో పాటు ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్‌ను కూడా అందజేస్తున్నారు. ఇందులో ఒక కిలో పచ్చి బియ్యం, ఒక కిలో చక్కెర, ఒక పూర్తి స్థాయి చెరుకు గడ ఉండనున్నాయి. వీటితో పాటు ఉచితంగా ధోతీ, చీరను కూడా పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శ్రీలంక తమిళ పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా ఈ అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

టోకెన్ల పంపిణీ - పంపిణీ షెడ్యూల్

రేషన్ షాపుల వద్ద తోపులాటలు, రద్దీని నివారించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జనవరి మొదటి వారంలోనే వాలంటీర్లు, రేషన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టోకెన్లను పంపిణీ చేస్తారు. ఈ టోకెన్‌పై ఏ రోజు, ఏ సమయంలో రేషన్ షాపుకు వచ్చి నగదు, సరుకులు తీసుకోవాలో స్పష్టంగా ఉంటుంది. జనవరి 8, 2026న ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పంపిణీని అధికారికంగా ప్రారంభిస్తారు. జనవరి 14వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన వారందరికీ ఈ పండుగ కానుక అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story