BREAKING: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు.. ఆ రెండు పార్టీలు కలిస్తే?

by Naga Rani Yarlagadda |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.

BREAKING: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు.. ఆ రెండు పార్టీలు కలిస్తే?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం రేపు (మే 7) జరుగుతుందని అందరూ భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ 118 ఎమ్మెల్యేల మద్దతును నిరూపించుకోవడంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రిసార్టు రాజకీయాల వేదికగా మహాబలిపురం

గెలిచిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు టీవీకే అధిష్ఠానం 'రిసార్ట్ పాలిటిక్స్'కు తెరలేపింది. గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలందరూ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మహాబలిపురం సమీపంలోని ఒక ప్రైవేట్ రిసార్టులోనే ఉండాలని పార్టీ అధిష్ఠానం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇతర పార్టీల నుంచి ప్రలోభాలు రాకుండా ఉండేందుకే విజయ్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్ పార్టీకి కాంగ్రెస్ 5 సీట్లు మద్దతు ప్రకటించినప్పటికీ, ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది. ఈ క్రమంలో మద్దతు కోసం వామపక్షాలను విజయ్ కోరగా, వారు ప్రస్తుతానికి నిరాకరిస్తూ డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలాన్ని నిరూపించుకునేందుకు విజయ్ గవర్నర్‌ను రెండు వారాల సమయం కోరిన విషయం తెలిసిందే.

పెద్ద సవాల్ గా చిన్న అడ్డంకులు

మరోవైపు, టీవీకే ఎమ్మెల్యేలందరూ రిసార్టులోనే ఉండి తదుపరి వ్యూహంపై చర్చిస్తున్నారు. అటు ఏఐడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు కూడా చర్చలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేజిక్ ఫిగర్ అందుకునే వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించకూడదని పార్టీ నిర్ణయించింది. తమిళనాడులో తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ (టీవీకే) దశాబ్దాల కాలంగా ఉన్న డీఎంకే, ఏఐడీఎంకేల ఆధిపత్యానికి చెక్ పెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికారం చేపట్టే క్రమంలో ఈ చిన్నపాటి అడ్డంకులు విజయ్‌కు పెద్ద సవాల్‌గా మారాయి.

మిత్రపక్షాలన్నీ కలిస్తే మ్యాజిక్ ఫిగర్

మరోవైపు డీఎంకే, ఏఐడీఎంకే కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటుతోంది. డీఎంకే 59 స్థానాల్లో, అన్నాడీఎంకే 47 స్థానాల్లో గెలిచాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే.. మెజార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరుతుంది. ఈ క్రమంలో ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న సంకేతాలొస్తున్నాయి. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్లో ఉన్న వామపక్షాలు విజయ్ వైపు మొగ్గుచూపడం లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Next Story