తాడ్మెట్ల నక్సల్స్ అటాక్ కేసు.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-08 06:45:08  IST  )

ఛత్తీస్‌గఢ్‌లోని తాడ్మెట్ల నక్సల్ దాడి కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

తాడ్మెట్ల నక్సల్స్ అటాక్ కేసు.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) చరిత్రలోనే అత్యంత విషాదకరమైన తాడ్మెట్ల (Tadmetla) నక్సల్ దాడి కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులను విడుదల చేస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే, విచారణ సందర్భంగా ఇంతటి భారీ దాడి జరిగినప్పటికీ, నిందితులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు సరైన, నమ్మదగిన సాక్ష్యాలను కోర్టు ఎదుట ఉంచలేకపోయాయని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేవలం అనుమానం ఆధారంగా ఎవరినీ దోషులుగా నిర్ధారించలేమని ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా, జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

దర్యాప్తు అంతా తప్పులతడక..

నిందితుల గుర్తింపు ప్రక్రియ (Identification Parade), ఇతర చట్టపరమైన విధివిధానాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు ఎత్తిచూపింది. సాక్ష్యాధారాలు బలంగా లేకపోవడం వల్ల నిందితులను దోషులుగా తేల్చలేమని వెల్లడించింది. కాగా, 14 రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్ర బిందువైన దంతెవాడ జిల్లా తాడ్మెట్ల దట్టమైన అడవుల్లో కాగా, 2010 ఏప్రిల్ 6న మావోయిస్టులు పకడ్బందీగా పన్నిన ఉచ్చులో సీఆర్‌పీఎఫ్ దళాలు చిక్కుకున్నాయి. సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా సుమారు 120 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కంపెనీ బేస్ క్యాంప్‌కు తిరిగి వస్తుండగా.. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ దాడి జరిగింది.

కేవలం 4 కి.మీ దూరంలోని కొండ ప్రాంతాల నుంచి మావోయిస్టు పార్టీ గెరిల్లా టీమ్ కమాండర్ మడావి హిడ్మా సారథ్యంలో వారిపైకి మావోయిస్టులు బుల్లెట్ల వర్షం కురిపంచారు. అకస్మాత్తుగా దాడికి గురైన సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరపడానికి ప్రయత్నించినా, మావోయిస్టు కాల్పులు జరుపుతూ వారిపైకి దూసుకురావడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. క్షణాల్లోనే దాదాపు సీఆర్‌పీఎఫ్ కంపెనీ దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మృతుల్లో డిప్యూటీ కమాండెంట్ సత్యవాన్ సింగ్ యాదవ్, అసిస్టెంట్ కమాండెంట్ బీఎల్ మీనా, ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్‌తో సాహా 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద నక్సల్ దాడిలో ఒకటిగా నిలిచింది. ఈ కేసులో 2013లో అదనపు సెషన్స్ కోర్టు సాక్ష్యాలు లేవని నిందితులను విడుదల చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా, తాజాగా హైకోర్టు కూడా దిగువ కోర్టు తీర్పునే సమర్థించింది. 76 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఇంతటి భారీ ఘటనలో నిందితులు విడుదల కావడం దర్యాప్తు సంస్థల వైఫల్యాన్ని స్పష్టంగా వేలెత్తి చూపేలా ఉందని పలువరు కామెంట్ చేస్తున్నారు. తగిన ఆధారాలు చూపలేకపోవడం వల్లే అమర జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగలేదనే ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది.

Next Story