చేయని తప్పుకు 48 ఏళ్లు జైలులో గడిపిన నిరపరాధి.. గుండెలను పిండేస్తున్న 104 సంవత్సరాల వృద్ధుడి కథ..

by Sujitha Rachapalli |

ఎంత మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా ఓకే.. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడితే అక్కడ సిస్టెమ్ ఫెయిల్ అయినట్లే అనే ఓ సినిమా డైలాగ్ గుర్తుందా? దాన్ని బట్టి చూస్తే మన న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయినట్లే. అవును.. ఓ నిర్దోషి చేయని తప్పుకు 48ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు

చేయని తప్పుకు 48 ఏళ్లు జైలులో గడిపిన నిరపరాధి.. గుండెలను పిండేస్తున్న 104 సంవత్సరాల వృద్ధుడి కథ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎంత మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా ఓకే.. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడితే అక్కడ సిస్టెమ్ ఫెయిల్ అయినట్లే అనే ఓ సినిమా డైలాగ్ గుర్తుందా? దాన్ని బట్టి చూస్తే మన న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయినట్లే. అవును.. ఓ నిర్దోషి చేయని తప్పుకు 48ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు. రీసెంట్‌గా నిర్దోషిగా బయటకు వచ్చాడు. కానీ లైఫ్ అంతా అయిపోయాక.. న్యాయం జరిగితే ఏముందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఆయనకు సంబంధించిన కథ తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన 104 సంవత్సరాల వృద్ధుడు లఖన్ పాసీ. తాను చేయని హత్య కేసులో దాదాపు 48 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసి.. చివరకు నిర్దోషిగా విడుదలయ్యాడు. 1977 ఆగస్టులో కౌశాంబి జిల్లాలోని గౌరాయే గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రభు సరోజ్ హత్య జరిగింది. అప్పటికి 50 ఏళ్ల వయసులో ఉన్న లఖన్ పాసీని.. మరో ముగ్గురితో కలిసి అరెస్టు చేశారు. 1982లో ప్రయాగ్‌రాజ్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించించింది. జీవిత ఖైదు విధించింది. అయితే లఖన్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీలు చేశాడు. కానీ న్యాయ ప్రక్రియ నీరసంగా సాగింది. న్యాయవాదుల మార్పు, కోర్టు తేదీలు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలతో న్యాయ పోరాటం సంక్లిష్టమైంది. అతని కుటుంబం భూమిని అమ్మి న్యాయవాద ఖర్చులను భరించింది. కుమార్తెలు ఈ పోరాటంలో స్థిరంగా మద్దతు ఇచ్చారు. మొత్తానికి 2025 మే 2న.. అలహాబాద్ హైకోర్టు లఖన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. శిక్షను రద్దు చేసింది. మే 20న 104 సంవత్సరాల వయసులో.. అతను కౌశాంబి జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు.

కాగా జైలు రికార్డుల ప్రకారం లఖన్ జనవరి 4, 1921న జన్మించాడు. ఇక లఖన్‌తోపాటు నిందితుడైన దేశ్‌రాజ్ కూడా నిర్దోషిగా విడుదలయ్యాడు. మరో ఇద్దరు నిందితులు కలేశ్వర్, కల్లు న్యాయ ప్రక్రియ సమయంలో మరణించారు. అయితే లఖన్ కుమార్తే ఆశాదేవి.. ఈ పోరాటంలో పూర్తి సపోర్ట్ ఇచ్చింది. కానీ కుమారుడు పట్టించుకోలేదు. ఇక భార్య 20ఏళ్ల క్రితమే చనిపోయింది. మొత్తానికి ఈ శిక్షా కాలంలో ఆయన జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఆరోగ్యం క్షీణించింది. దృష్టి, జ్ఞాపకశక్తి బలహీనమైంది. కాగా ఈ కేసు న్యాయ వ్యవస్థలో జాప్యం, అసమర్థమైన న్యాయ సహాయం, నిర్దోషులకు సుదీర్ఘ జైలు శిక్ష ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.

Next Story