Syria: సిరియాలో బాంబు పేలుడు.. 18 మంది మహిళలు మృతి

by B.Srinivas |

సిరియాలోని అలెప్పో ప్రావీన్సులో సోమవారం కారు బాంబు పేలడంతో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Syria: సిరియాలో బాంబు పేలుడు.. 18 మంది మహిళలు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో విషాదం నెలకొంది. అలెప్పో ప్రావీన్సు (Aleppo province) లో సోమవారం కారు బాంబు పేలడంతో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రావీన్సులోని మన్‌బిజ్ (Manbij) నగర శివార్లలో వ్యవసాయ కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం పక్కనే బాంబు పేలింది. దీంతో 19 మంది అక్కడికక్కడే మరణించగా వీరిలో 18 మంది మహిళలే కావడం గమనార్హం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. పేలుడు జరిగిన కారును రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనతో సిరియాలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

మన్‌బిజ్‌లో నెల రోజుల వ్యవధిలో ఇది ఏడో బాంబు పేలుడు అని సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ మునీర్ ముస్తఫా (Musthafa) తెలిపారు. దాడుల కారణంగా నివాసితులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సిరియా పౌరుల ప్రాంతాలపై నిరంతర దాడులు, నిర్వీర్యమైన అసద్ (Asad) పాలన నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పౌరులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. కాగా, సిరియాలో గతేడాది డిసెంబర్‌లో బషర్ అల్-అసద్ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అలెప్పోలోని మన్‌బిజ్‌లో హింస కొనసాగుతోంది. అంతకుముందు శనివారం జరిగిన దాడిలో నలుగురు పౌరులు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు.

Next Story