- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెనాడాలో రూ.173 కోట్ల బంగారం దోపిడీ.. ఇండియాలో సాధారణ జీవిత గడుపుతున్న నిందితుడు
ప్రీత్ పనేసర్ ప్రస్తుతం చంఢీఘర్ శివార్లలో ఒక అద్దె ఇంట్లో తన భార్య, మాజీ మిస్ ఇండియా ఉగాండా ప్రీతీతో కలిసి నివసిస్తున్నాడు.

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా చరిత్రంలోనే అతిపెద్ద చోరీలో నిందుతుల్లో ఒకరు ఆ దేశం నుంచి పారిపోయి చంఢీఘర్ వచ్చి సాధారణ జీవితం గడుపుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. 2023 ఏప్రిల్లో కెనడాలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కార్గోలో భారీ చోరీ జరిగింది. 400 కేజీల బరువున్న 6,600 స్వచ్ఛమైన బంగారం కడ్డీలు, రూ.21 కోట్ల విలువైన పలుదేశాల కరెన్సీని కార్గో కాంపౌండ్ నుంచి చోరీ చేశారు. జూరిక్ నుంచి వచ్చిన విమానంలో నుంచి ఈ బంగారం, కరెన్సీని చాకచక్యంగా చోరీ చేశారు. ఇందులో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు కెనడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వారిలో మాజీ ఎయిర్ కెనడా మేనేజర్ సిమ్రన్ ప్రీత్ పనేసర్ (32) కూడా ఉన్నాడు. రూ.173 కోట్ల విలువైన ఈ భారీ దోపిడీ జరిగిన సమయంలో ఎయిర్ కెనడాలో మేనేజర్‌గా పని చేస్తున్న ప్రీత్ పనేసర్.. ఆ తర్వాత పోలీసులకు కూడా సహకరించాడు. కార్గో సెక్షన్ మొత్తం తిప్పి దోపిడీ ఎక్కడ జరిగిందనే సమాచారం కూడా ఇచ్చాడు. కానీ పోలీసులకు ప్రీత్ పనేసర్ మీద అనుమానం కలిగిన తర్వాత కెనడాలో కనిపించకుండా పోయాడు.
కాగా, ప్రీత్ పనేసర్ ప్రస్తుతం చంఢీఘర్ శివార్లలో ఒక అద్దె ఇంట్లో తన భార్య, మాజీ మిస్ ఇండియా ఉగాండా ప్రీతీతో కలిసి నివసిస్తున్నాడు. అతను తన భార్య కుటుంబం, తన కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నట్లు తెలిసింది. అయితే కెనడాలో జరిగిన దోపిడికి ప్రీత్ పనేసర్ భార్య ప్రీతీ పనేసర్‌కు సంబంధం లేదని తెలుస్తుంది. దోపిడి అనంతరం చంఢీఘర్ వచ్చిన ప్రీత్‌ను బంధువుల, చుట్టుపక్కల వాళ్లు ప్రశ్నించగా.. కెనడాలో ఒక ఆర్థిక లావాదేవీకి సంబంధించిన వివాదం నడుస్తుందని, ప్రస్తుతం అది పరిష్కారం అయ్యిందని చెప్పినట్లు తెలిసింది. అయితే చంఢీఘర్‌లో సాధారణ జీవితం గడుపుతున్న ప్రీత్ పనేసర్.. కెనడాలో ఒక లాయర్‌ను పెట్టుకొని చోరీ కేసును డీల్ చేస్తున్నాడు. కెనడియన్ పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారని తెలుసుకొని.. కొన్నిరోజుల కిందట తానే వచ్చి లొంగిపోతానని కూడా చెప్పినట్లు తెలిసింది. కానీ ప్రీత్ పనేసర్ మాత్రం కెనడా వెళ్లకుండా చంఢీఘర్‌లోనే ఉండిపోయాడు.
బంగారం దోపిడీ జరిగిన సమయంలో ప్రీత్ పనేసర్ ఒంటారియాలోని ప్రాంప్డన్‌లో నివసిస్తూ ఉండేవాడు. అయితే దోపిడి అనంతరం ఇండియాకు వచ్చేశాడు. అప్పటి నుంచి తన లాయర్లతోనే కెనడియన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. కాగా, కెనడాలోని పీల్ రీజినల్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. దీనికి 24 క్యారెట్ అనే పేరు పెట్టుకున్నారు. తొలి ఏడాదిలో 20 మంది అధికారులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో పాల్గొన్నారు. ఎయిర్ కెనడాకు చెందిన మరో ఉద్యోగి పరంపాల్ సిద్దు కూడా ఈ దోపిడిలో పాల్గొన్నట్లు విచారణలో తెలిసింది. ప్రీత్ పనేసర్‌తో కలిసి అతడు పని చేసేవాడని పోలీసులు తెలిపారు. అయితే పరంపాల్ గతంలోనే పోలీసులకు లొంగిపోయాడు. మొత్తం తొమ్మిది మందిలో ఎనిమిది మంది అనుమానితులు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయినట్లు కెనడా అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 4,30,00 డాలర్లు (సుమారు రూ.3 కోట్లు) కరెన్సీ, రూ.77 లక్షల విలువైన ప్యూర్ గోల్డ్ బ్రేస్లెట్లను రికవరీ చేశారు. ఈ బ్రేస్‌లెట్లు దొంగలించిన బంగారపు కడ్డీల నుంచి తయారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటితో పాటు బంగారం కరిగించడానికి ఉపయోగించిన సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.






