Supreme court: ఆ రాష్ట్రాలపై ధిక్కార చర్యలు తీసుకుంటాం.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

by B.Srinivas |

తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Supreme court: ఆ రాష్ట్రాలపై ధిక్కార చర్యలు తీసుకుంటాం.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు (Supreme court) హెచ్చరించింది. అల్లోపతి వైద్యాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఏదైనా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం తప్పుదోవ పట్టించే యాడ్స్‌పై చర్యలు తీసుకోని పక్షంలో కోర్టు ధిక్కార చట్టం 1971 ప్రకారం చర్యలు ప్రారంభించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతేడాది మే 7వ తేదీన డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘించే తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించి 2018 నుంచి తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ లైసెన్సింగ్ అధికారుల అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ఆదేశించింది.

సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్ వాదనలు వినిపిస్తూ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం 1954లోని సెక్షన్ 3, 4 ప్రకారం ఉల్లంఘించిన వారిపై ప్రాసిక్యూషన్ మాత్రమే పరిష్కారమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్‌లు దాఖలు చేసిన అఫిడవిట్‌లపై ఫిబ్రవరి 10న సమీక్షిస్తామని ధర్మాసనం పేర్కొంది. అదనపు అఫిడవిట్‌లు ఏవైనా ఉంటే ఫిబ్రవరి 3లోగా సమర్పించాలని సూచించింది.

Next Story