- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవధపై తమిళనాడు సర్కారుకు ఊరట.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలకు సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా స్టే విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలకు సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా స్టే విధించింది. బక్రీద్ పండుగకు ముందు గానీ, ఆ తర్వాత ఏ రోజైనా గానీ రాష్ట్రంలో ఆవులు, దూడలను వధ చేయకుండా చూడాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
రెండు వారాల క్రితం తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు జంతు సంరక్షణ చట్టం - 1958లోని సెక్షన్-4 ప్రకారం అనుమతించిన ప్రత్యేక పరిస్థితుల్ని మినహాయించి.. ఆవుల వధపై సంపూర్ణ నిషేధం విధించడం చట్టానికి విరుద్ధమని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుత చట్టం ప్రకారం 10 సంవత్సరాలు దాటినా లేదా.. వ్యవసాయ పనులకు, సంతానోత్పత్తికి పనికిరాని పశువుల్ని సంబంధిత అధికారుల ధృవీకరణ పత్రంతో వధించేందుకు అనుమతి ఉందని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఉత్తర్వుల్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉండవని స్పష్టం చేసింది.
ఈ వివాదానికి కారణమైన ఉత్తర్వులను మే 27న జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. అధీకృత స్లాటర్ హౌస్‌లలో మాత్రమే జంతువుల వధ జరగాలని పేర్కొన్న హైకోర్టు, బక్రీద్ సందర్భంగా మాత్రమే కాకుండా ఇతర ఏ రోజునైనా ఆవులు, దూడలను వధ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వాలని కూడా పేర్కొంది.






