- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరావళి తీర్పుపై సుప్రీంకోర్టు స్టే.. కొత్త కమిటీ వేయాలని నిర్ణయం
ఆరావళి తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆందోళనల నేపథ్యంలో ఈ అంశంపై కొత్త కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆరావళి పర్వత శ్రేణుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది. కొన్నిరోజుల క్రితం ఈ విషయంలో అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించింది. ఆరావళి పర్వతాలను గుర్తించడంపై గతంలో ఇచ్చిన తీర్పుపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏజీ మాసీతో కూడిన ధర్మాసన ఈ అంశంపై మాట్లాడుతూ.. ఆరావళి అంశంలో కొన్ని అంశాలపై స్పష్టత అవసరమని అభిప్రాయపడింది. దీనిపై విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ‘ఈ కోర్టు ఇచ్చిన తీర్పు, కమిటీ ప్రతిపాదనలను నిలిపివేయాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. మరో కమిటీని ఏర్పాటు చేసే వరకు ఈ స్టే ఉంటుంది’ అని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఇటీవలే అంగీకరించిన ఆరావళి డెఫినిషన్ వల్ల అక్రమ మైనింగ్ ప్రబలి, పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.
ఆ తీర్పులో ఇచ్చిన ఆరావళి పర్వత శ్రేణిని వివరించేందుకు ఇచ్చిన వివరణ వల్ల నిర్మాణాత్మక సమస్యలు తలెత్తుతాయా? అని పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అదే సమయంలో ఆరావళి పర్వతశ్రేణిలో భాగం కాని ప్రాంతాలను కూడా దీనిలో చేర్చడం వల్ల అక్రమ మైనింగ్‌కు ఊతమయ్యే అవకాశం ఉందా? అని కూడా ఆలోచించాలని సూచించింది. అలాగే పర్వతాల మధ్య ఉన్న 500 మీటర్ల దూరాల్లో మైనింగ్‌కు అనుమతిస్తారా? అప్పుడు పర్యావరణానికి ఇబ్బంది కలుగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రాంతంలో ఉన్న 12,081 పర్వతాల్లో కేవలం 1,048 మాత్రమే గతంలో పేర్కొన్న 100 మీటర్ల ఎత్తు అనే ప్రమాణాన్ని అందుకుంటాయనే వాదన నిజమేనా? దీనిపై మరో జియోలాజికల్ సర్వే అవసరమా? అని కూడా సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.






