వారం రోజులకే పదవి గల్లంతు.. శృంగేరి ఎమ్మెల్యే జీవరాజ్‌కు సుప్రీంకోర్టు షాక్

by Malleboina Mahesh |

శృంగేరి ఎన్నికల రీకౌంటింగ్ ఫలితాలపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో బీజేపీ నేత జీవరాజ్ ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. గత ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్ నేత రాజేగౌడనే ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.

వారం రోజులకే పదవి గల్లంతు.. శృంగేరి ఎమ్మెల్యే జీవరాజ్‌కు సుప్రీంకోర్టు షాక్
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ (Sringeri Assembly Constituency) ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారాయి. మొన్న హైకోర్టు, నిన్న సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయంతో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. వివరాల్లోకి వెళితే.. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి.డి. రాజేగౌడ కేవలం 201 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి డి.ఎన్. జీవరాజ్‌పై విజయం సాధించారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జీవరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, తిరస్కరించిన 279 పోస్టల్ ఓట్లను పునఃపరిశీలించి, రీకౌంటింగ్ నిర్వహించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పునిచ్చింది. మే 2న జరిగిన రీకౌంటింగ్‌లో జీవరాజ్ 52 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో, ఆయన మే 6న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే, ఈ రీకౌంటింగ్ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారని, ఇప్పటికే చెల్లుబాటు అయిన ఓట్లను కూడా మళ్లీ వెరిఫై చేసి అన్యాయంగా తగ్గించారని రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజేగౌడ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులపై, రీకౌంటింగ్ ఫలితాలపై స్టే విధిస్తూ నిన్న (మే 11, 2026) తీర్పునిచ్చింది. రీకౌంటింగ్‌కు ముందున్న స్థితిని (Status quo ante) పునరుద్ధరించాలని ఆదేశించడంతో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే జీవరాజ్ తన పదవిని కోల్పోయారు. ఈ క్రమంలోనే రాజేగౌడ తిరిగి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. ఈ కేసులో ఓట్ల తారుమారు జరిగిందనే ఆరోపణలపై అధికారుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతుండటం గమనార్హం.

Next Story