ఆర్మీ బ్రాంచ్ పోస్టుల్లో 2:1 నిష్పత్తిపై సుప్రీంకోర్టు అసహనం

by Phanindra |

ఆర్మీ బ్రాంచ్ పోస్టుల్లో 2:1 నిష్పత్తిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది.

ఆర్మీ బ్రాంచ్ పోస్టుల్లో 2:1 నిష్పత్తిపై సుప్రీంకోర్టు అసహనం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యంలో జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ (లీగల్‌) బ్రాంచి పోస్టుల్లో అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్‌ విధానం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ రిజర్వేషన్‌ను అమలు చేయకూడదని తేల్చి చెప్పింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్‌ చేయకూడదని స్పష్టం చేసింది. సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్‌ కౌర్‌, ఆస్థ త్యాగీ అనే మహిళా అభ్యర్థులు 4, 5వ ర్యాంకులు సాధించారు.

అయినప్పటికీ వీరిని విధుల్లోకి తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పురుష అభ్యర్థులకన్నా తమకు మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్‌ చేసింది.ఈ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. ‘‘పురుషులకు 6.. మహిళలకు 3 పోస్టులు కేటాయించాలనే విధానం సరైంది కాదు.

లింగ సమానత్వానికి నిజమైన అర్థం స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమే. అంతేగానీ, ఇలా మహిళలకు సీట్లను పరిమితం చేయడం సమానత్వ హక్కును ఉల్లంఘించడమే’’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా స్త్రీ, పురుష అభ్యర్థుల మెరిట్‌ జాబితాను బహిర్గతం చేయాలని సూచించింది. ఇలాంటి విధానాలు పాటిస్తే ఏ దేశమూ భద్రంగా ఉండబోదని హెచ్చరించింది.

Next Story