- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై 2021లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై 2021లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటే తప్ప.. కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత కోసం స్పైవేర్‌ను ఉపయోగించడం ఏమాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది. ఈ విషయం దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముడిపడి ఉన్న నేపథ్యంలో ఇందులో తాము రాజీ పడబోమని పేర్కొంది. అదేవిధంగా పెగాసస్ స్పైవేర్ ఆరోపణలపై అప్పటి చీఫ్ జస్టీస్ ఎన్‌వీ రమణ ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను కూడా బహిరంగపరచలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడితో మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ కామెంట్ చేయండం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, పెగాసస్ స్పైవేర్ ద్వారా 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో 40 మంది జర్నలిస్టులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉన్నారు. అయితే, పెగాసస్ స్పైవేర్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని 2021లో సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్‌లతో పాటు మరో ఐదుగురు జర్నలిస్టులు ప్రేమ్ శంకర్ ఝా, ఆర్కే సింగ్, ప్రాంజయ్ తకుర్తా, ఎస్ఎన్ అబీదీ, ఇప్సా షతక్సి రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్‌లు స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.






