Supreme Court: ఏఐతో నకిలీ తీర్పుల సృష్టి.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

by Ramesh Naini |

కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి న్యాయవాదులు, కక్షిదారులు ఏకంగా లేని కోర్టు తీర్పులను ఉన్నట్లుగా సృష్టిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Supreme Court: ఏఐతో నకిలీ తీర్పుల సృష్టి.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి న్యాయవాదులు, కక్షిదారులు ఏకంగా లేని కోర్టు తీర్పులను ఉన్నట్లుగా సృష్టిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కల్పిత తీర్పులను కోర్టుల్లో ఉదహరించడం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ జాడ్యంలా మారిపోయిందని జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

బాంబే హైకోర్టు ఘటన..

ఇటీవల బాంబే హైకోర్టులో ఓ కంపెనీ డైరెక్టర్‌కు సంబంధించిన కేసులో కక్షిదారుడు చాట్‌జీపీటీ (ChatGPT) సాయంతో వాదనలు సిద్ధం చేసి సమర్పించాడు. అందులో ‘జ్యోతి వర్సెస్ ఎలిగెంట్ అసోసియేట్స్’ అనే కల్పిత తీర్పును ఉదహరించాడు. ఆ తీర్పు తాలూకు ఎలాంటి కాపీని గానీ, ఆధారాలను గానీ అతడు కోర్టుకు సమర్పించలేదు. దీంతో న్యాయమూర్తులు, లా క్లర్కులు ఆ కేసు వివరాల కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. పదే పదే ఒకే విషయాన్ని చెప్పడం, గ్రీన్-బాక్స్ టిక్ మార్కులు, బుల్లెట్ పాయింట్లు వంటివి గమనించిన హైకోర్టు.. ఈ వాదనలను చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్‌తో తయారు చేసినట్లు నిర్ధారించింది. ఇలాంటి కల్పిత కేసుల వల్ల న్యాయస్థానం విలువైన సమయం వృథా అవుతోందని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగిస్తూనే.. ఏఐ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.

పరిశోధన వరకే ఏఐ పరిమితం..

న్యాయపరమైన పరిశోధనలు (రీసెర్చ్) చేసుకోవడానికి ఏఐ టూల్స్ బాగానే ఉపయోగపడతాయని, కానీ అందులోంచి వచ్చే ఉదాహరణలను కోర్టు ముందు ఉంచేటప్పుడు అవి నిజమైనవో కాదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత (క్రాస్ వెరిఫికేషన్) పూర్తిగా సంబంధిత వ్యక్తులదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయపరంగా దృష్టి సారించినట్లు ధర్మాసనం వెల్లడించింది.

Next Story