Supreme court: మహిళా ఆఫీసర్ల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

by B.Srinivas |

అనుభవజ్ఞులైన మహిళా అధికారులను పక్కన పెట్టడానికి ఇది సమయం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. వారి స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని పేర్కొంది.

Supreme court: మహిళా ఆఫీసర్ల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: అనుభవజ్ఞులైన మహిళా సైనికాధికారులను పక్కన పెట్టడానికి ఇది సమయం కాదని సుప్రీంకోర్టు (Supreme court) తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా ఆఫీసర్ల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. షార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరించే నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. భారత సైన్యం వారిని సర్వీసులోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. మహిళా అధికారులు కోర్టు గదుల్లో తిరుగుతూ ఉండటానికి లేదా వారిని పక్కన పెట్టడానికి ఇది సమయం కాదని తెలిపింది. వారు అద్భుతమైన అధికారులని వారి సేవలను వినియోగించుకోవాలని, ఆ ఆఫీసర్లను నిరుత్సాహపర్చొద్దని సూచించింది. చట్టపరమైన సమస్యలను సరైన టైంలో పరిష్కరిస్తామని ఈలోగా, వారి సేవలను ఉపయోగించుకోవాలని కేంద్రానికి తెలిపింది.

సైన్యానికి యువ అధికారులు అవసరం

భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని జస్టిస్ సూర్యకాంత్ నొక్కి చెప్పారు. యువకులు శిక్షణ పొందాలని వారికి మార్గనిర్దేశం చేస్తూ ట్రెయినింగ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. యువకులు, అనుభవజ్క్షులతో కూడిన దళాలు దేశానికి ఎంతో అవసరమని తెలిపారు. సరిహద్తులో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ ప్రస్తుత పరిస్థితుల్లో సైన్యానికి మద్దతివ్వాలన్నారు. తమకు బలమైన సైన్యం ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నామని చెప్పారు. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేశారు. కాగా, భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story