ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్: డీఈఆర్‌సీ‌లో నియామకాల జాప్యంపై నోటీసులు

by Kema Shiva Kumar |

ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (DERC)లో రెగ్యులర్ నియామకాలు, శాశ్వత సభ్యుల భర్తీ చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్: డీఈఆర్‌సీ‌లో నియామకాల జాప్యంపై నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (DERC)లో కీలకమైన రెగ్యులర్ నియామకాలు, శాశ్వత సభ్యుల భర్తీ చేపట్టకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ (LG) కార్యాలయానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అయితే, రాజధాని ఢిల్లీలో విద్యుత్ ఛార్జీల నియంత్రణ, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో డీఈఆర్‌సీ (Delhi Electricity Regulatory Commission) కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కొంతకాలంగా సంస్థలో చైర్‌పర్సన్‌తో పాటు కీలక సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా తాత్కాలిక నియామకాలతోనే నడుస్తుండటంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారించింది.

కాగా, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య ఉన్న అధికారాల పోరు కారణంగానే ఈ నియామకాలు నిలిచిపోయాయని, దీంతో విద్యుత్ నియంత్రణ మండలి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధమైన సంస్థల్లో ఇలాంటి కీలక నియామకాలను నిలిపివేయడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. వీలైనంత త్వరగా రెగ్యులర్ నియామకాల ప్రక్రియను ఎందుకు పూర్తి చేయలేదో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story