Flash: మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. స్కూళ్లకు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

మహిళల ఆరోగ్యం, గౌరవం, గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Flash: మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. స్కూళ్లకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ఆరోగ్యం, గౌరవం, గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నెలసరి పరిశుభ్రత హక్కు (మెన్స్ట్రువల్ హైజీన్) అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద ఉన్న జీవించే హక్కు, గోప్యత హక్కులో భాగమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది మహిళలు, బాలికలు గౌరవంగా జీవించేందుకు అవసరమైన మౌలిక హక్కుగా గుర్తించింది. జస్టిస్‌ జేబీ పర్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. పాఠశాల విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు, సరైన పారిశుధ్య సదుపాయాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా వీటిని అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

తీర్పులో భాగంగా.. అన్ని పాఠశాలల్లో బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందించాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే బాలికలు, బాలురకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక టాయిలెట్లు కూడా ఉండాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ పర్దివాలా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ తీర్పు న్యాయవ్యవస్థకు మాత్రమే కాదు. సహాయం అడగడానికి సంకోచించే బాలికలకు, వారికి సహాయం చేయాలనుకున్నా.. వనరులు లేని ఉపాధ్యాయులకు కూడా అంకితం. బలహీనులను ఎంతగా కాపాడతామన్నదే అభివృద్ధికి కొలమానం” అని వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటికీ వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. బాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఏర్పాటు చేయకపోతే లేదా ఉచిత శానిటరీ ప్యాడ్లు అందించకపోతే ప్రైవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. నెలసరి పరిశుభ్రత అనేది దయతో ఇచ్చే సహాయం కాదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కేనని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైతే వాటిని బాధ్యత వహింపజేస్తామని కోర్టు స్పష్టంగా తెలిపింది.

నెలసరి విషయంలో ఉన్న అపోహలు, మౌలిక వసతుల కొరత బాలికల ఆరోగ్యం, చదువు, గోప్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ పరిస్థితి మారాలంటే సమాజం దృక్పథం మారాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసు గత ఏడాది నవంబర్‌లో హర్యానాలోని మహర్షి దయానంద యూనివర్సిటీలో జరిగిన ఘటనతో మొదలైంది. అక్కడ ముగ్గురు మహిళా పారిశుధ్య కార్మికులను, వారు నెలసరిలో ఉన్నారని నిరూపించడానికి శానిటరీ ప్యాడ్ల ఫొటోలు పంపాలని బలవంతం చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన “పీరియడ్ షేమింగ్”పై తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.

ఆ సమయంలో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తరహా చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ఉన్న ప్రమాదకరమైన మనస్తత్వాన్ని చూపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) పిటిషన్ దాఖలు చేసింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న అవమానకర తనిఖీలు జీవించే హక్కు, గౌరవం, గోప్యత, శరీర స్వేచ్ఛకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొంది. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళా కార్మికులకు గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని, నెలసరి సమయంలో అవమానకరంగా వ్యవహరించకుండా రక్షణ కల్పించాలని SCBA కోరింది. గత విచారణలో.. నెలసరి సమయంలో నొప్పుల కారణంగా మహిళలు భారమైన పనులు చేయలేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోర్టు సూచించింది.

ఇదిలా ఉండగా.. మహర్షి దయానంద యూనివర్సిటీ ఘటనపై విచారణ చేపట్టామని, బాధ్యులైన ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని హర్యానా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మహిళల నెలసరి పరిశుభ్రతను రాజ్యాంగ హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చరిత్రాత్మకమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది బాలికల ఆరోగ్యం, విద్య, గౌరవాన్ని కాపాడే దిశగా కీలక మలుపుగా భావిస్తున్నారు.

Next Story