- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చొరబాటుదార్లకు రెడ్ కార్పెట్ పరుస్తామా? సుప్రీంకోర్టు సూటిప్రశ్న!
రోహింగ్యాలు మిస్సింగ్ అంటూ వేసిన కేసుపై విచారణ సందర్భంగా చొరబాటుదార్లకు రెడ్ కార్పెట్ పరుస్తామా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఐదుగురు రోహింగ్యాలు కనిపించడం లేదంటూ నమోదైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు దేశంలో రెడ్ కార్పెట్ పరచాలా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని ఇక్కడే ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఐదుగురు రోహింగ్యాలకు కస్టడి నుంచి మాయమయ్యారని, దేశబహిష్కార ప్రక్రియ నిబంధనలు పాటించాలంటూ నమోదైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బోర్డర్ దగ్గర సొరంగం తవ్వి లేదా ఫెన్స్ దాటి దేశంలో అక్రమంగా ప్రవేశిస్తారు. నేను ఇప్పుడు ఇక్కడకు వచ్చాను కాబట్టి.. ఈ దేశంలోని చట్టాలు అమలవ్వాలి అంటారు. ఆహారం, షెల్టర్, నా పిల్లలకు విద్య దక్కాలని వాదిస్తారు. చట్టాలను అంత విస్తృతం చేయాలా?’ అని సీజేఐ ప్రశ్నించారు.
‘మన దేశంలో కూడా బీదవారున్నారు. వాళ్లు మన పౌరులు. వాళ్లకు కొన్ని వసతులు, సదుపాయాలు పొందే హక్కు లేదా? వాళ్లపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు?’ అని జస్టిస్ సూర్యకాంత్ అడిగారు. ఇలా అక్రమ వలసదారుల విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం చాలా ఫ్యాన్సీగా ఉంటుందని విమర్శించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అరెస్టయిన వ్యక్తి ఎవరైనా అతన్ని కస్టడీలో ఉంచడం చట్టబద్ధమైనదేనా? కాదా? అని నిర్ణయించేందుకు కోర్టు ముందు హాజరుపరచాలి. అయితే ఇలా దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని కూడా థర్డ్ డిగ్రీ పద్ధతుల్లో విచారించకూడదని సీజేఐ స్పష్టంచేశారు. ఇదే సమయంలో రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తించలేదని ఆయన చెప్పారు.
‘చట్టబద్ధంగా శరణార్థుల స్టేటస్ లేకుండా.. దేశంలో అక్రమంగా ప్రవేశించిన వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా? ఉత్తర భారతంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో చొరబాటుదార్లు ప్రవేశిస్తే.. వారికి రెడ్ కార్పెట్ పరుస్తామా?’ అని సీజేఐ నిలదీశారు. బాధితులు నేరుగా కోర్టును సంప్రదించినప్పుడే ఇలాంటి కేసులపై విచారణ చేపట్టాలని, లేదంటే అసలు వీటిని ఏమాత్రం ఉపేక్షించకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఈ క్రమంలో కేసు విచారణను డిసెంబరు 16న ఇలాంటి మిగతా కేసులతో కలిపి చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.






