పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్.. బారామతిలో సునేత్రా ఏకగ్రీవం!

by Prasad Jukanti |

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతి ఉప ఎన్నిక పోటీ నుంచి కాంగ్రెస్ తప్పుకుంది.

పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్..  బారామతిలో సునేత్రా ఏకగ్రీవం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతి ఉప ఎన్నిక (Baramati Bypoll) పోటీ నుంచి కాంగ్రెస్ వైదొలిగింది. దీంతో డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ (Sunetra Pawar)ఏకగ్రీవంగా గెలుపుకు మార్గం సుగమం అయింది. జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ మరణంతో బారామతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానం నుంచి అజిత్ పవార్ సతీమని సునేత్ర పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆకాశ్ మోర్ ను బరిలోకి దింపింది. ఈ నెల 23న జరగాల్సి ఉన్న పోలింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి తరపున ప్రచారం సైతం ప్రారంభించింది. అయితే అజిత్ పవార్ గౌరవార్థం పోటీ నుంచి తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తప్పుకుంటున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం ఎన్సీపీ చీఫ్ పార్టీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే, ఎమ్మెల్యే రోహిత్ పవార్ సహా ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకులు ఉప ఎన్నికలో పోటీ చేయవద్దని తమ పార్టీకి మరోసారి విజ్ఞప్తి చేశారని ఈ నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సప్కల్ వెల్లడించారు.

సంప్రదాయం కంటిన్యూ:

అయితే నిన్న ఉప ఎన్నికలో తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చూడాలని కోరుతూ సునేత్రా పవార్ కాంగ్రెస్ చీఫ్‍తో మాట్లాడారు. మహారాష్ట్రలో ఒక ప్రముఖ నేత మరణించినప్పుడు, వారి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే ఇతర పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకుండా గౌరవించే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ కాంగ్రెస్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ తప్పుకోవడంతో, అధికార మహాయుతి (NCP - అజిత్ పవార్ వర్గం) అభ్యర్థిగా ఉన్న సునేత్రా పవార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP), ఉద్ధవ్ థాకరే శివసేన (UBT) కూడా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించగా తాజాగా కాంగ్రెస్ సైతం పోటీ నుంచి తప్పుకోవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.

Next Story