చర్చిలో సూసైడ్ బాంబ్ బ్లాస్ట్.. 13 మంది మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-22 19:58:12  IST  )

ఆదివారం (జూన్ 22) సిరియాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రాజధాని డమాస్కస్‌ శివార్లలోని డ్వీలా ప్రాంతంలో ఉన్న మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్‌ లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడు.

చర్చిలో సూసైడ్ బాంబ్ బ్లాస్ట్.. 13 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం (జూన్ 22) సిరియాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రాజధాని డమాస్కస్‌ శివార్లలోని డ్వీలా ప్రాంతంలో ఉన్న మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్‌ (Suicide Bomber) లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడు.

సిరియా అధికార వార్తా సంస్థ సానా (SANA) కథనం ప్రకారం.. ఈ పేలుడులో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. మరో 53 మంది గాయపడ్డారు. అయితే బ్రిటన్‌కు చెందిన వార్ మానిటర్‌ 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' వెల్లడించిన సమాచారం ప్రకారం మృతులు, గాయపడిన వారు అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. స్థానిక మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. అయితే సిరియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరల ప్రకారం.. ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)కు చెందిన ఓ ఉగ్రవాది చర్చిలోకి ప్రవేశించి ముందుగా కాల్పులు జరిపి, అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఓ ప్రత్యక్ష సాక్షి రావద్ మాట్లాడుతూ.. “ఆ దాడికి పాల్పడిన వ్యక్తి ఇద్దరితో కలిసి వచ్చాడు. ఇద్దరూ అక్కడి నుండి పారిపోయారు. ఆ వ్యక్తి మొదట చర్చిపై కాల్పులు జరిపాడు. తర్వాత లోపలికి వెళ్లి బాంబు పేల్చుకున్నాడు” అని చెప్పారు.

పేలుడు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, ప్రథమ చికిత్సా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనాస్థలంలో రక్తపు మరకలు, ఛిద్రమైన శరీరాలు వంటి భయంకర దృశ్యాలు కనిపించాయి. ఒక మహిళ మోకాళ్లపై కూర్చుని కంటతడి పెట్టిన దృశ్యాలు హృదయాలను కలిచివేశాయి. గత కొన్ని సంవత్సరాలలో సిరియాలో జరిగిన అత్యంత తీవ్రమైన చర్చి ఉగ్రదాడిగా గుర్తింపు పొందింది.

ఈ ఘటనపై సిరియా సమాచార మంత్రి హమ్జా ముస్తఫా తీవ్రంగా స్పందించారు. "ఇది ఓ పిరికిపంటి ఉగ్రవాద చర్య. మన సమాజం కలుపుకుపోతున్న విలువలకు ఇది విరుద్ధం. సమాన పౌర హక్కులకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఉగ్రవాద సంస్థలపై ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తుంది" అని మంత్రిత్వ శాఖ X (ట్విటర్)లో పేర్కొంది.

Next Story