తరచూ ఫోన్లు దొంగిలిస్తున్న కొడుకు.. అనూహ్య నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-03 07:16:31  IST  )

తరచూ ఫోన్లు దొంగిలించడం, ఇంటి నుంచి పారిపోతుండటంతో తమ 12 ఏళ్ల కొడుకు విషయంలో తల్లిదండ్రులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

తరచూ ఫోన్లు దొంగిలిస్తున్న కొడుకు.. అనూహ్య నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ ఫోన్లు దొంగిలించడం, ఇంటి నుంచి పారిపోతుండటంతో తమ 12 ఏళ్ల కొడుకు విషయంలో తల్లిదండ్రులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే వారిపై కేసు నమోదు చేసేలా చేసింది. మహారాష్ట్రలోని నాగ్ పుర్ కు చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ 12 ఏళ్ల కొడుకు తరచూ ఇంటి నుంచి పారిపోవడం, ఇతరుల ఫోన్లు దొంగిలించడం వంటివి చేస్తుండటంతో అలాంటివి మానుకోవాలని వారించారు. అయినా వినకపోవడంతో.. చేసేది లేక ఇతరులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశ్యంతో ఆ బాలుడిని గొలుసులతో కట్టేసి 2 నెలలుగా ఇంట్లోనే బంధించి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చెల్డ్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న శిశుసంక్షేమ కేంద్ర అధికారులు బాలుడిని గొలుసుల నుంచి విడిపించి ప్రొటెక్షన్ సెంటర్ నకు తరలించారు. తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

బాలుడి కాళ్లు, చేతులను గొలుసులతో బంధించి ఉంచడంతో గాయాలు అయ్యాయని, దాంతో అతను తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలుడు మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా.. కూలిపనులకు వెళ్తేగానీ తమకు పూటగడవని పరిస్థితి అని, అందుకే కొడుకుని అలా బంధించి వెళ్లక తప్పలేదని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు.

Next Story