కరోనాపై రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష

by Disha Web Desk 17 |
కరోనాపై రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష
X

న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని మాండవీయా చెప్పారు. దీంతో పాటు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయడమే కాకుండా కరోనా నిర్వహణ విధానాన్ని అనుసరించాలని తెలిపారు. కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ అధికారులతో కలిసి శని, ఆదివారాల్లో కరోనా సన్నద్ధతను సమీక్షించాలని కోరారు.

ఈ నెల 10, 11న రాష్ట్ర మంత్రులు ఆసుపత్రులను సందర్శించి ఆరోగ్య సదుపాయాలపై మాక్ డ్రిల్స్ నిర్వహణను పరిశీలించాలని సూచించారు. కరోనా నిర్వహణకు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రాలు హాట్ స్పాట్లను గుర్తించడంతో పాటు టెస్టులను వేగవంతం చేయాలని చెప్పారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులందరూ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల సంసిద్ధతను సమీక్షించాలని సూచించారు. ఆసుపత్రి పడకల లభ్యతతో పాటు అవసరమైన మందుల తగినంత స్టాక్ ఉందని నిర్ధారించుకోవాలని ఆయన అభ్యర్థించారు. దీంతో పాటు కొవిడ్ ఇండియా పోర్టల్‌లో తమ కొవిడ్ డేటాను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని కోరారు.

6,050 కొత్త కేసులు వెలుగులోకి..

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,050 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోలిస్తే 13 శాతం ఎక్కువ నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కాగా, ఈ ఏడాది ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు గత 24 గంటల్లో 14 మంది వైరస్ బారిన పడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,943కు చేరింది.

Next Story

Most Viewed