దక్షిణాది సహా ఏడు రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

by Ajay Maddhiboyina |

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిషా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఈ పోరాటంపై సమ్మతిని కోరుతున్నామని లేఖలో తెలిపారు.

దక్షిణాది సహా ఏడు రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
X

- డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటుకు పిలుపు

- మార్చి 22న చెన్నైలో జేఏసీ తొలి సమావేశం

- డీలిమిటేషన్ సమాఖ్యవాదంపై దాడి

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌విభజన కారణంగా నష్టపోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. పునర్‌విభజన కారణంగా జరుగుతున్న నష్టంపై కేంద్రంతో పోరాటడానికి అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దక్షిణాదిన ఉన్న కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు సీట్ల పరంగా నష్టపోతున్న ఒడిషా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్యమంత్రులకు కూడా ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. దీంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న అధికార, ప్రతిపక్ష, ఇతర పార్టీల అధ్యక్షులను కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తందా జరగనున్న డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేద్దామని ఆ లేఖలో తెలిపారు. ఇటీవల చెన్నైలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష భేటీలో చేసిన తీర్మానం ఆధారంగా ఈ లేఖ రాసినట్లు తెలిసింది.

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిషా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఈ పోరాటంపై సమ్మతిని కోరుతున్నామని లేఖలో తెలిపారు. తమిళనాడు రూపొందిస్తున్న ఏకీకృత వ్యూహాన్ని సమన్వయ పరుస్తూ జేఏసీలో పని చేయగలిగే సీనియర్ నాయకులను ప్రతినిధులుగా పంపాలని ఆయా రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష, ఇతర పార్టీల అధ్యక్షులను లేఖలో కోరారు. ఈ నెల 22న చెన్నై వేదికగా జేఏసీ తొలి సమావేశం నిర్వహిస్తున్నామని, ఇందులో డీలిమిటేషన్‌పై కీలకమైన చర్చ జరుగుతుందని ఎంకే స్టాలిన్ తెలిపారు. ఇది నాయకత్వం, పరస్పర సహకారం అందించుకోవల్సిన సమయం.. రాజకీయ విభేదాలకు అతీతంగా అందరం ఏకమై, ఒకే తాటిపై నిలబడాలని స్టాలిన్ పేర్కొన్నారు.

ఇక స్టాలిన్ డీలిమిటేషన్‌ వల్ల నష్టాపోతున్న రాష్ట్రాలు ఏకమవ్వాల్సిన సందర్భాన్ని వివరిస్తూ 'ఎక్స్'లో కూడా పోస్టు పెట్టారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై కేంద్ర చేస్తున్న దాడిగా అభివర్ణించారు. పార్లమెంటులో మన హక్కులకు కోత పెట్టి.. జనాభాను నియంత్రించినందుకు గాను దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడమే అవుతుందని అన్నారు. ఈ అన్యాయాన్ని అసలు సహించబోమని చెప్పారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా నిలబడాల్సిన అవసరం ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. స్టాలిన్ తన ఎక్స్‌ పోస్టులో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పినరయ్ విజయన్, సిద్ద రామయ్య, మోహన్ చరణ్ మాజి, మమత బెనర్జీ, భగవంత్ మాన్‌లతో పాటు వైసీపీ, జనసేన, బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీజేడీ, సీపీఐ, సీసీఎం పార్టీలను కూడా ట్యాగ్ చేశారు. ఈ అంశం కేవలం పాలనపై ఒక సాధారణ చర్చ మాత్రమే కాదని.. ఆయా రాష్ట్రాల హక్కులు, అభివృద్ధి కోసం వనరులు పొందగల సామర్థ్యంపై ప్రాథమిక చర్చగా స్టాలిన్ పేర్కొన్నారు.

Next Story