Srilanka: శ్రీలంక మాజీ ప్రెసిడెంట్ రనీల్ విక్రమసింఘే అరెస్ట్

by S Gopi |

ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణల కింద ఆయనపై చర్యలు తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు

Srilanka: శ్రీలంక మాజీ ప్రెసిడెంట్ రనీల్ విక్రమసింఘే అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను శుక్రవారం ఆ దేశ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణల కింద ఆయనపై చర్యలు తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విక్రమసింఘే కొలంబో సీఐడీ అదుపులో ఉన్నారు. 2023లో విక్రమసింఘే లండన్ పర్యటనకు వెళ్లారు. ఓ యూనివర్శిటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భార్యతో కలిసి వెళ్లారు. అయితే, ఈ పర్యటన అధికారికంగా నిర్వహించినది కాదని, దానికోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నారని తేలింది. అంతేకాకుండా ఆ పర్యటనలో చేసిన ఖర్చు మొత్తం ప్రభుత్వ నిధులతోనే చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. కానీ, జీ-7 సదస్సుకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో లండన్‌కు వెళ్లినప్పుడు తన భార్య ఖర్చులను ఆమె చూసుకుందని, అందులో ఎలాంటి ప్రభుత్వ నిధులు వాడలేదని విక్రమసింఘే ఆరోపణలను తిప్పికొడుతునారు. కానీ, ఆ పర్యటనలో ప్రభుత్వ నిధులను వాడినట్టు, విక్రమసింఘే సెక్యూరిటీకి కూదా చెల్లించారని సీఐడీ వాదిస్తోంది. ఆయనను అదుపులోకి తీసుకున్న అనంతరం కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. శ్రీలంక ప్రధానమంత్రిగా రికార్డు స్థాయిలో ఆరుసార్లు పనిచేసిన విక్రమసింఘే, దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయం 2022లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో ఆర్థిక మాంద్యం కారణంగా మొదలైన నిరసనలతో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శ్రీలంక నుంచి పారిపోవడం, తర్వాత రాజీనామా చేయడంతో ఆయన అధ్యక్షుడు అయ్యారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో విక్రమసింఘే ఓడిపోయారు.

Next Story