ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై ప్రత్యేక యోగా కార్యక్రమం

by Yella Dhawani Reddy |

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తం యోగా ఉత్సాహంతో నిండిపోయింది.

ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై ప్రత్యేక యోగా కార్యక్రమం
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా ప్రపంచం మొత్తం యోగా ఉత్సాహంతో నిండిపోయింది. ఆరోగ్యాన్ని, మానసిక సమతౌల్యాన్ని చాటిచెప్పే ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని వివిధ దేశాల్లో, ప్రత్యేకత కలిగిన ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లోనూ అరుదైన ప్రదేశాల్లో యోగా కార్యాచరణలు చోటు చేసుకున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని (Jammu Kashmir) రీసి జిల్లాలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జ్‌పై (Chenab bridge) ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి సౌందర్యంతో నిండిన చీనాబ్ లోయను ఆవిష్కరిస్తూ, ఆకాశాన్ని తాకేలా నిర్మించిన ఈ అద్భుత వంతెనపై యోగా సాధన ఒక అరుదైన అనుభూతిని అందించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రీసి జిల్లా ప్రాశాసనిక విభాగం, నార్తర్న్ రైల్వే, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. వందలాది మంది అధికారులు, సిబ్బంది, స్థానికులు, యోగా అభిమానులు ఈ యోగా శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని, వివిధ ఆసనాలు ఆచరించారు. ఇక ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్.. ' యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ (Yoga for One Earth, One Health)'. ఇది వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కూడా సమగ్రంగా పరిగణించే భారతీయ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇక చీనాబ్ వంతెనను జూన్ 9న ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 1,315 మీటర్ల పొడవు కలిగిన ఈ స్టీల్ ఆర్చ్ బ్రిడ్జ్ భూకంపాలు, గాలివానలు వంటి సవాళ్లను ఎదుర్కొనేలా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడింది. ఇది జమ్ము, శ్రీనగర్ మధ్య రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాశ్మీర్ లోయను తొలిసారిగా దేశ ప్రధాన భూభాగానికి రైలు మార్గంగా అధికారికంగా కలిపే ఘట్టంగా ఈ బ్రిడ్జ్ చరిత్రలో నిలిచింది.

Next Story