సౌత్ కొరియాలో యూఎస్ దళాలు చాలా కీలకం: ప్రెసిడెంట్ అభ్యర్థి లీ జే మ్యుంగ్

by Phanindra |

సౌత్ కొరియాలో యూఎస్ దళాలు చాలా కీలకమని, చైనాను నిలువరించడానికి ఇవి అవసరమని ఆ దేశ ప్రెసిడెంట్ అభ్యర్థి లీ జే మ్యుంగ్ అన్నారు.

సౌత్ కొరియాలో యూఎస్ దళాలు చాలా కీలకం: ప్రెసిడెంట్ అభ్యర్థి లీ జే మ్యుంగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాను నిలువరించడానికి దక్షిణ కొరియాలో యూఎస్ దళాలు చాలా కీలకమని డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా (డీపీకే) ప్రెసిడెన్షియల్ అభ్యర్థి లీ జే మ్యుంగ్ అన్నారు. గత డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో సడెన్‌గా మార్షల్‌ లా అమలు చేయడంతో అభిశంసన ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే కొరియా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తామని లీ జే మ్యుంగ్ ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా దళాలు, చైనా వంటి కీలకమైన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో యూఎస్, రష్యా మధ్య చర్చలు కూడా చైనాపై మరింత ఒత్తిడి తెస్తాయని లీ అన్నారు. దీని వల్ల ఆర్కిటిక్ సముద్ర మార్గాలు తెరుచుకుంటాయని, ఇవి యూఎస్, రష్యాతోపాటు కొరియాకు కూడా చాలా ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. గతంలో ప్రొ-చైనా పాలసీతో బరిలో దిగిన లీ.. ఈసారి తన విధానాలను పూర్తిగా మార్చుకోవడం గమనార్హం. అలాగే ఉత్తర కొరియాకు చెక్ పెట్టేందుకు దక్షిణ కొరియా కూడా అణు అస్త్రాలు సిద్ధం చేసుకోవాలనే ఆలోచనను మాత్రం లీ తోసిపుచ్చారు. సౌత్ కొరియా అణుబాంబులు సిద్ధం చేసుకుంటే జపాన్, ఇతర దేశాలు కూడా అణుబాంబుల కోసం ప్రయత్నాలు మొదలు పెడతాయన్నారు.

ట్రంప్-కిమ్ చర్చలపై..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాగ్ ఉన్‌తో చర్చలు జరిపేందుకు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించడంపై కూడా లీ స్పందించారు. డీన్యూక్లియరైజేషన్ కోసం ట్రంప్ ప్రయత్నించడం మంచిదేనని, ఇలా జరిగితే కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన జరుగుతుందని, ఇది మొత్తం ఈశాన్య ఆసియాకు మంచిదని చెప్పారు. అయితే ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో దక్షిణ కొరియాను పక్కన పెట్టడం అంత తేలిక కాదని, ఈ విషయంలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉంటామని లీ పేర్కొన్నారు.

Next Story