Impeachment : దక్షిణ కొరియా అధ్యక్షుడికి తప్పిన పదవీ గండం

by Hajipasha |
Impeachment : దక్షిణ కొరియా అధ్యక్షుడికి తప్పిన పదవీ గండం
X

దిశ, నేషనల్ బ్యూరో : దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌(Yoon Suk Yeol)కు పదవీ గండం తప్పింది. ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ ప్రకటనతో చిక్కుల్లో పడిన ఆయనపై విపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని(Impeachment) ప్రవేశపెట్టాయి. అయితే అధికార ‘పీపుల్‌ పవర్‌’ పార్టీకి చెందిన చాలామంది చట్టసభ సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించారు. దక్షిణ కొరియా నేషనల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు 192 సీట్లు ఉండగా, అధికార పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులే ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో అభిశంసన నుంచి అధ్యక్షుడు(South Korea President) యూన్‌ సుక్‌ యోల్‌ బయటపడ్డారు. దేశాధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే నేషనల్‌ అసెంబ్లీలోని కనీసం 200 మంది సభ్యుల మద్దతు అవసరం.

ఓట్ల సంఖ్య 200కు చేరుకోనందున బ్యాలెట్ లెక్కింపు లేకుండానే తీర్మానం రద్దయ్యింది. ఒకవేళ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ పదవిని కోల్పోతే.. దాన్ని ప్రతిపక్షాలు దక్కించుకునే అవకాశం ఉండేది. అందుకే అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌కు అధికార ‘పీపుల్‌ పవర్‌’ పార్టీ సభ్యులు దూరంగా ఉండిపోయారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపిస్తూ ఇటీవలే యూన్‌ సుక్‌ యోల్‌ దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ విధించారు. అయితే సొంత పార్టీతో పాటు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశ పార్లమెంట్‌లో ఓటింగ్‌ పెట్టి ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో యూన్‌ ఓ టెలివిజన్‌ ఛానల్‌లో మాట్లాడుతూ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని వెల్లడించారు.

Advertisement

Next Story