రాజ్యసభకు సోనియా.. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రియాంక!

by Dishanational4 |
రాజ్యసభకు సోనియా.. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రియాంక!
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 77 ఏళ్ల సోనియా ఆరోగ్యం బాగా లేనందున త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో జైపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంతకుముందు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇంకొన్ని వారాల్లో ఆయన పదవీకాలం ముగియనుంది. మన్మోహన్ స్థానంలో తదుపరిగా సోనియాను రాజ్యసభకు పంపనున్నారని తెలుస్తోంది. ఇక ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి ఆమె పోటీ చేస్తారని హస్తం పార్టీ వర్గాలు అంటున్నాయి.

సురక్షితమైన సీటు.. రాయ్‌బరేలీ

2006 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు వరుసగా సోనియాగాంధీ ఎన్నికవుతూ వచ్చారు. 2019లో ఉత్తరప్రదేశ్‌లో మోడీ వేవ్, యోగి వేవ్ వీస్తున్న టైంలోనూ రాయ్‌బరేలీలో సోనియానే విజయఢంకా మోగించారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మరో కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈ లెక్కన కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు అత్యధికంగా ఉన్న సురక్షిత స్థానం రాయ్‌బరేలీ. అందుకే అక్కడి నుంచి ప్రియాంకాగాంధీని పోటీ చేయించేందుకు హస్తం పార్టీ రంగం సిద్ధం చేస్తోంది.1950వ దశకం నుంచే ఈ స్థానంలో కాంగ్రెస్ హవా వీస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మొదట ప్రియాంక తాత ఫిరోజ్ గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీపై ప్రియాంకాగాంధీ పోటీచేస్తారని అందరూ భావించారు. కానీ సరిగ్గా అదే టైంలో తూర్పు ఉత్తరప్రదేశ్‌కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించారు.


Next Story

Most Viewed