Rajnath Singh: కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి

by S Gopi |

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కానీ, అటువంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు

Rajnath Singh: కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ దాడి తర్వాత భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలిసారి చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా చైనాలోని కింగ్‌డావోలో గురువారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో మనదేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏప్రిల్‌లో జరిగిన పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను పరోక్షంగా విమర్శిస్తూ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని, ప్రపంచానికి గట్టి సందేశాన్ని ఇచ్చారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్నారు. దాన్ని నిలవరించేందుకు, సరిహద్దు ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని చెప్పారు. 'కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ పాలసీగా వాడుతున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కానీ, అటువంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్‌సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఉగ్రవాద స్పాన్సర్లను చట్టం ముందు నిలబెట్టాలి

చైనా ముందే పాకిస్తాన్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్ సింగ్.. ఉగ్రవాదులను కాపాడుతూ, తరచూ దాడులకు దిగే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టం, ఉగ్రవాద స్థావరాలపై దాడికి ఎంతమాత్రం వెనుకాడేది లేదని పేర్కొన్నారు. 'ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవి, సమర్థించలేనివి. వాటి ప్రేరణ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరు చేసినా అవి నేరపూరితమే. ఎస్‌సీఓ సభ్యులు ఈ దుష్టత్వాన్ని నిస్సందేహంగా ఖండించాలి' అని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదం సహా ఉగ్రవాద చర్యలకు పాల్పడినవారు, ఆర్థిక సహాయం అందించేవారు, స్పాన్సర్లను జవాబుదారీగా ఉంచి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని వెల్లడించారు.

డాక్యుమెంట్‌లో లేని పెహల్గాం ప్రస్తావన

రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగం అనంతరం.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని నీరుగార్చే విధంగా ఉన్న ఎస్‌సీఓ జాయింట్ డాక్యుమెంట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించారు. ఎస్‌సీఓ డాక్యుమెంట్ ఉగ్రవాదం నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. కానీ ఉగ్రవాదంపై రాజ్‌నాథ్ సింగ్ భారత్ వైఖరిని స్పష్టంగా తెలియజేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశం అనంతరం చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం అవ్వాలని రాజ్‌నాథ్ సింగ్ భావిస్తున్నారు. ఇరు దేశాల సైనిక హాట్‌లైన్‌ను తిరిగి ప్రారంభించడంపై దృష్టి సారించారు. అదేవిధంగా అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేస్తుంది. శాంతి, స్థిరత్వానికి ఏర్పడే ముప్పును ఎదుర్కోవడంలో ఎస్‌సీఓ సభ్యుల మధ్య మరింత ఐక్యతకు రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఈ సమస్యలకు మూలం కారణమైన దేశ యువతలోని రాడికలైజేషన్ సిద్ధాంతం పెరగకుండా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం నాటి చైనా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో భారత్‌తో పాటు పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు.

Next Story