కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాల్సిందే: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

by Naga Rani Yarlagadda |

సోషల్ మీడియా సంస్థలు కంటెంట్ క్రియేటర్లకు తమ ఆదాయంలో కొంత వాటాను ఇవ్వాల్సిందేనని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాల్సిందే: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తమ ఆదాయంలో కంటెంట్ సృష్టించే వారికి న్యాయమైన వాటాను అందించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం స్పష్టం చేశారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) కాన్ క్లేవ్ 2026లో పాల్గొన్న ఆయన ఆదాయ పంపిణీలో పారదర్శకత ఉండాలని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కోరారు.

ఆదాయంలో భాగస్వామ్యం చట్టబద్ధం కావాలి

"వార్తా సంస్థలు, సంప్రదాయ మీడియా, మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రొఫెసర్లు, పరిశోధకులు.. ఇలా ఎవరైతే ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారో, వారందరికీ సోషల్ మీడియా సంస్థలు చట్టబద్ధంగా ఆదాయంలో వాటా ఇవ్వాలి. కష్టపడి కంటెంట్ సృష్టించే వారికి న్యాయం జరగాలనేదే మా అభిప్రాయం" అని మంత్రి పేర్కొన్నారు. కేవలం ఆదాయం మాత్రమే కాకుండా.. ప్లాట్‌ఫారమ్‌లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో ఆ సంస్థలే బాధ్యత వహించాలని మంత్రి సున్నితంగా హెచ్చరించారు.

డీప్ ఫేక్ అతిపెద్ద సవాలు

సమాజం వేల ఏళ్లుగా నిర్మించుకున్న సంస్థలపై నమ్మకాన్ని పెంచేలా ప్లాట్‌ఫారమ్‌లు వ్యవహరించాలి. పిల్లలు, సాధారణ పౌరుల ఆన్‌లైన్ భద్రత బాధ్యత పూర్తిగా ఆయా సంస్థలదే. సమాజ పునాదులను దెబ్బతీసే విధంగా ప్లాట్‌ఫారమ్‌లు ఉండకూడదని ఆయన హితవు పలికారు. నేటి కాలంలో డీప్‌ఫేక్స్ (Deepfakes), తప్పుడు సమాచారం (Misinformation) అతిపెద్ద సవాలుగా మారాయని అశ్విని వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి సమాజంలోని విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడకుండా చూడాలని కోరారు. అశ్లీలత, కృత్రిమంగా సృష్టించిన నకిలీ కంటెంట్‌పై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా డీప్‌ఫేక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించారు.

Next Story