- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాతో నిరంతరం పర్యవేక్షణ.. నియంత్రణ అవసరం: కేంద్రం
సోషల్ మీడియాతో మనపై నిరంతరం పర్యవేక్షణ ఉంటోందని, కాబట్టి దీన్ని నియంత్రించడం అవసరమని కేంద్రం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని, మనల్ని సోషల్ మీడియా నిరంతరం మానిటర్ చేయడం వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కంటెంట్ నిర్మూలించాలనే మార్గదర్శకాలపై ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ వేసిన కేసులో కర్ణాటక హైకోర్టుకు కేంద్రం ఈ విషయం తెలియజేసింది. ఇంటర్నెట్‌లో ఉండే ‘ఎక్స్’ వంటి మధ్యవర్తులు బాధ్యతతో వ్యవహరించాని, వ్యక్తులకు ఉండే చట్టబద్ధ హక్కులన్నీ ఈ సంస్థలకు వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.
ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను తొలగించేందుకు ప్రభుత్వం సెక్షన్ 79(3)(బి) చట్టాన్ని ఉపయోగిస్తుంది. దీన్ని ఉపయోగించుకొని కంటెంట్‌ను బ్లాక్ చేయడం సరికాదంటూ ఎక్స్ కేసు వేసింది. ఐటీ నియమాల్లోని సెక్షన్ 69ఏ నిబంధనలకు అనుగుణంగానే కంటెంట్ తొలగించే ఆర్డర్స్ ఇవ్వాలని, అంతేకానీ సెక్షన్ 79 కింద నేరుగా ఆర్డర్స్ ఇవ్వకూడదని ఎక్స్ వాదించింది. ఈ క్రమంలో డిజిటల్ సర్వయిలెన్స్ గురించి మెహతా వివరించారు.
‘కెమెరా ఉన్న టీవీలను కూడా సర్వయిలెన్స్ కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ఎంతోమంది ప్రముఖులు.. తమను కలిసేందుకు వచ్చిన వారిని ఫోన్లు బయట పెట్టేసి రమ్మంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు దాదాపు రికార్డర్లుగా మారిపోయాయి. మనల్ని సోషల్ మీడియా నిరంతరం మానిటర్ చేస్తూనే ఉంది’ అని చెప్పారు. ఏఐను కూడా ప్రస్తావించిన ఆయన.. ఏఐ అద్భుతమైన డెవలప్‌మెంట్ టూల్ అని, అదే సమయంలో దీన్ని వినాశనానికి కూడా ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి టెక్నాలజికల్ సమస్యలను నియంత్రించేందుకు చట్టాలు కూడా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
తమకు కూడా భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని ఎక్స్ చేసిన వాదనలను మెహతా తోసిపుచ్చారు. ఎక్స్ అనేది సింపుల్‌గా ఒక నోటీస్ బోర్డు వంటిదని, దాంట్లో పోస్ట్ చేసే వారికి ఆర్టికల్ 19 (భావప్రకటనా స్వేచ్ఛ) హక్కు ఉంటుందని, కంపెనీకి కాదని ఆయన చెప్పారు. ప్రభుత్వం, కోర్టు ఆర్డర్ల ప్రకారం చట్టవ్యతిరేకమైన కంటెంట్‌ను ఇలాంటి మధ్యవర్తి సంస్థలు తొలగించాలని, లేదంటే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే ‘సేఫ్ హార్బర్’ హక్కులు కోల్పోతారని ఆయన హెచ్చరించారు.
సోషల్ మీడియాను నియంత్రించం ఎందుకు అవసరమో చెప్పిన ఆయన.. 2019లో 26 వేల సైబర్ నేరాలు నమోదైతే.. 2024లో ఈ సంఖ్య ఏకంగా 22.6 లక్షలకు చేరిందని గుర్తుచేశారు. అంటే వ్యక్తులు, సముదాయాలు, దేశంపై ఇంటర్నెట్‌లో దాడులు జరుగుతున్నాయని, కాబట్టి ప్రభుత్వంతోపాటు ఆయా సోషల్ మీడియా వేదికలు, రెగ్యులేటర్లు కలిసి ఈ దాడులను నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు.






