షాకింగ్.. మధ్యాహ్న భోజనంలో పాము.. ఆస్పత్రిలో చేరిన 100 మంది విద్యార్థులు

by Ajay Maddhiboyina |

బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము పిల్ల వచ్చింది.

షాకింగ్.. మధ్యాహ్న భోజనంలో పాము.. ఆస్పత్రిలో చేరిన 100 మంది విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము పిల్ల వచ్చింది. గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు అన్నంతో పాటు పప్పు వడ్డించగా అందులో పాముపిల్ల దర్శనం ఇచ్చింది. భోజనం చేసిన వందలాది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. పిల్లలకు వడ్డించిన భోజనం ఓ ఎన్జీవో సంస్థ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఓ విద్యార్థికి భోజనం వడ్డిస్తుండగా పాము కనిపించింది. తరవాత ఆ ఆహారం తిన్న విద్యార్థులు అంతా కడుపునొప్పితో బాధపడ్డారు. సిబ్బంది విద్యార్థులను స్థానిక‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వారిలో కొంత‌మంది ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌గా వారిని జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ ఫుడ్ స‌ర‌ఫ‌రా చేసిన ఎన్జీవోకు ఓ దర్యాప్తు బృందాన్ని పంపారు. ఆ ఎన్జీవో సంస్థ స‌ప్లై చేసిన ఆహారాన్ని ఇత‌ర స్కూళ్ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌కుండా వెంట‌నే ఆపేశారు. ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇదిలా ఉంటే మ‌ధ్యాహ్నం భోజ‌నంలో బొద్దింక‌లో, చిన్న చిన్న కీట‌కాలో రావ‌డం సాధార‌ణ‌మే కానీ ఏకంగా పాము పిల్ల రావ‌డంతో ఆందోళ‌న‌క‌రంగా మారింది. విద్యార్థుల కోసం వంట చేసేట‌ప్పుడు ఎంత నిర్ల‌క్ష్యంగా వండారో తెలిపేలా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌రి దీనిపై అధికారులు, ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Next Story