S.M. Krishna death: కర్ణాటకలో మూడ్రోజుల పాటు సంతాప దినాలు

by Shamantha N |

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (SM Krishna) మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

S.M. Krishna death: కర్ణాటకలో మూడ్రోజుల పాటు సంతాప దినాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (SM Krishna) మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా(3 Days Of Mourning) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 12 వరకూ ఎలాంటి కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించడం లేదని తెలిపింది. అంతేకాకుండా, డిసెంబర్ 11న కర్ణాటక వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఎస్ఎం కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీంతో, ప్రస్తుతం బెళగావిలో నిర్వహిస్తున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎస్‌ఎం కృష్ణ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ప్రధాని సంతాపం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) (SM Krishna) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. ఎస్‌ఎం కృష్ణ గొప్ప నేత అని, జీవితాంతం ఆయన ఇతరుల కోసం పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు. కర్ణాటక సీఎంగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశారని చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ శ్రద్ధ చూపేవారని పేర్కొన్నారు. ఎస్‌ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారని మోడీ కొనియాడారు. అనేక సార్లు తాను ఆయనతో సమావేశమయ్యానని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

కీలక పదవులు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా కొనసాగిన ఎస్‌ఎం కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు. 1999-2004 మధ్య కర్ణాటక సీఎంగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో బెంగళూరులో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత 2004 డిసెంబర్‌ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత, యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఎస్‌ఎం కృష్ణ పనిచేశారు.

Next Story