Sitharaman: త్వరలోనే జీఎస్టీ రేట్లు తగ్గుతాయి.. ఆర్థిక మంత్రి సీతారామన్

by B.Srinivas |

పన్ను రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని, జీఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Sitharaman: త్వరలోనే జీఎస్టీ రేట్లు తగ్గుతాయి.. ఆర్థిక మంత్రి సీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పన్ను రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని కాబట్టి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు మరింత తగ్గుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 2017 జూలై 1న జీఎస్టీ అమలులోకి వచ్చిన సమయంలో 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR) 2023 నాటికి 11.4 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇది మరింత దిగి వస్తుందని నొక్కి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీని మరింత సరళంగా, సౌకర్యవంతంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

2021లో ఏర్పాటైన మంత్రుల బృందం (GoM) స్లాబ్ సంస్కరణపై ఒక నివేదికను సిద్ధం చేసిందని, తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందన్నారు. ప్రపంచ అనిశ్చితుల కారణంగా స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు సాధారణమేనని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో రిటైల్ పెట్టుబడులను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంపై ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు.ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Next Story