Sitharaman: రూపాయి పతనానికి కారణమిదే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

by B.Srinivas |

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

Sitharaman: రూపాయి పతనానికి కారణమిదే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయం పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ స్థాయిలు పెరగడమే దీనికి కారణమని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభ, రాజ్యసభలో సమాధానమిచ్చారు. ప్రభుత్వం దాదాపు మొత్తం రుణాలను మూలధన వ్యయానికి నిధులు సమకూర్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.15.48 లక్షల కోట్లు కాగా, ఇది దేశ జీడీపీలో 4.3 శాతం అని తెలిపారు. 2024-25కి ముందు దేశ జీడీపీ వృద్ధి రేటు సగటున 8 శాతంగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.4 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

ద్రవ్యోల్బణం నియంత్రణకు చర్యలు

ద్రవ్య లోటు 4.4 శాతం మించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం నుండి 6 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే ఆహార ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా నియంత్రించామని, ప్రభుత్వం దానిని కొనసాగిస్తోందని నొక్కి చెప్పారు. యూపీఏ-2 హయాంలో ఆహార ద్రవ్యోల్భణం 11 శాతానికి చేరుకుందని దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. వ్యవసాయ పురోగతిపై దృష్టి పెట్టడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు ఆహార ద్రవ్యోల్బణాన్ని 5.3 శాతానికి తగ్గించిందని గుర్తు చేశారు. జీఎస్టీ అమలు తర్వాత ఒక్క వస్తువుపై కూడా రేటు పెంచలేదన్నారు.

సవాల్‌గా బడ్జెట్ రూపకల్పన

గత పదేళ్లలో ప్రపంచ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయని, ఈ క్రమంలో బడ్జెట్ తయారు చేయడం గతంలో కంటే సవాల్‌గా మారిందని తెలిపారు. బడ్జెట్ జాతీయ అవసరాలను, ఆర్థిక ప్రాధాన్యతలను సమతుల్యం చేస్తుందన్నారు. రాష్ట్రాలకు రూ.25.01 లక్షల కోట్లు కేటాయించామని, ఇది గత సంవత్సరం కంటే ఎక్కువని గుర్తు చేశారు. వీటిలో కేంద్ర పథకాలు, ఆర్థిక సంఘం నిధులు కూడా ఉన్నాయన్నారు. ఈ మొత్తంలో ఎటువంటి గణనీయమైన మూలధన వ్యయంలో తగ్గింపు లేదని, గత కొన్ని సంవత్సరాలుగా ఇది క్రమంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. 2017-18లో నిరుద్యోగిత రేటు 6 శాతం ఉంటే 2023-24 నాటికి 3.2 శాతానికి తగ్గిందని తెలిపారు.

అంతర్జాతీయ పరిస్థితులే కారణం

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటానికి వివిధ అంతర్జాతీయ, దేశీయ కారకాలు కారణమని అన్నారు. 2024 అక్టోబర్, 2025 జనవరి మధ్యకాలంలో భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 3.3 శాతం క్షీణించిందని గుర్తు చేశారు. కొన్ని ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ తగ్గుదల తక్కువగా ఉందని, దక్షిణ కొరియా వోన్, ఇండోనేషియా రూపాయి వరుసగా 8.1 శాతం, 6.9 శాతం తగ్గాయని గుర్తు చేశారు. అంతేగాక జీ10 కరెన్సీలు కూడా 6శాతానికి పైగా తగ్గాయన్నారు. పశ్చిమాసియా పరిస్థితులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఎన్నో దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయన్నారు.

ఏ గ్రహంపై నివసిస్తున్నారు?: ప్రియాంక గాంధీ

బడ్జెట్‌పై చర్చకు నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఆర్థిక మంత్రి ప్రయత్నించారని తెలిపారు. ‘దేశంలో ద్రవ్యోల్బణం లేదని, నిరుద్యోగ సమస్య లేదని, ద్రవ్యోల్భణం అదుపులో ఉందని ఆమె చెబుతోంది. ఆమె ఏ గ్రహంపై ఉన్నారో అర్థం కావడం లేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేవనెత్తిన ముఖ్యమైన అంశాలను నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారని, రాజకీయ ప్రసంగంలా సమాధానం చెప్పారని ఫైర్ అయ్యారు.

Next Story